గ్రేటర్లో మళ్లీ వరుణుడు విజృంభించాడు. ఉపరితల ఆవర్తనా నికి తోడు షియర్‌జోన్ ప్రభావంతో శుక్రవారం ఉదయం మొదలైన వాన అర్ధరా్రత్రి వరకు కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేని వానతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేడు, రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
సిటీబ్యూరో/అబిడ్స్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన ద్రోణి, షియర్జోన్ల ప్రభావంతో గ్రేటర్‌పై వరుణుడు మరోసారి విరుచుకుపడుతున్నాడు. శుక్రవారం ఉదయం నుంచే వాన దంచి కొడుతోంది. ఒక్క ప్రాంతమని లేకుండా గ్రేటర్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మొన్నటి వరకు నాలుగైదు రోజులు కురిసిన వర్షాలతో సతమతమైన గ్రేటర్ శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మరోసారి తడిసి ముద్దయ్యింది. రాత్రి 8 గంటల వరకు బాచుపల్లిలో అత్యధికంగా 12.8 సెం.మీ, హఫీజ్‌పేటలో 10.3 సెం.మీ, కూకట్పల్లి బాలానగర్‌లో 9.2 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు టీఎస్ డీపీఎస్ అధికారులు వెల్లడించారు. గ్రేటర్ పరిసరాల్లో ఈ వానకాలం సీజనల్లో ఇదే అత్యధిక వర్షపాతంగా వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణికి తోడు ఏర్పడిన షియర్జోన్ల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో గ్రేటర్‌కు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని టోలీచౌకి, కంట్రోల్ రూం, లంగర్ హౌజ్, రంగ్‌మహల్ చౌరస్తా, తోప్‌ఖానా తదితర ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచింది. ఆయా ప్రాంతాల్లో మాన్సూన్ బృందాలు, స్టాటిక్ టీంలు రంగంలోకి దిగి నీరు సాఫీగా పోయేలా చర్యలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్ పర్యవేక్షణ, ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టాయి. నాలాల్లో చెత్తా, వ్యర్థాలను తొలగించారు.
చార్మినార్, జూలై 22 : వర్షాలతో పురాతమైన మక్కా మసీదు వజూ హౌస్ గోడ స్వల్పంగా కూలిపోయిందని మక్కా మసీదు నిర్వాహకులు తెలిపారు. భక్తులు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు.
కంట్రోల్‌రూంలో మూడు షిఫ్టుల్లో నిరంతరం సహాయక చర్యలు
ఫిర్యాదుకు తక్షణ పరిష్కారం- ప్రాణనష్టం లేకుండా పక్కా ప్రణాళికలు
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ 24/7 అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బందితో సత్వరమే స్పందిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి 24 గంటలూ పనిచేసే విధంగా సహాయక చర్యలను వేగవంతం చేశారు.
ప్రధానంగా మై జీహెచ్ఎంసీ యాప్, టెలిఫోన్ నంబర్ 040-21111111, ట్విట్టర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయి అధికారులు పంపించి పరిషారం చేస్తున్నారు. ఈ క్రమంలో జూలై 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు వాటర్ లాగింగ్ పై వచ్చిన 1456 ఫిర్యాదులను పరిష్కరించారు. విద్యుత్, టౌన్ ప్లానింగ్, రోడ్లు, వాటర్ వర్స్, శానిటేషన్, ఆయా విభాగాలకు సంబంధించిన సమస్యలపై కూడా వస్తున్న ఫిర్యాదులు స్వీకరించి పరిషారానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.