Heavy Rains | హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరోసారి జడి వాన కురుస్తోంది.. దీంతో భాగ్యనగర వాసులు భయాందోళనకు గురువుతున్నారు. నిన్నటి మాదిరి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునుగుతాయా..? అని ఆందోళన చెందుతున్నారు. ప్యాట్నీ సెంటర్, పైగా కాలనీ, ఉప్పల్, బయో డైవర్సిటీతో పాటు పలు ఏరియాలు నీట మునిగి అటు వాహనదారులు, ఇటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇవాళ కూడా అలాంటి పరిస్థితి తలెత్తుతే ఏంటని భయపడిపోతున్నారు.
నగరం నలువైపులా భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నివాసాలకే పరిమితం కావాలని, నివాసాల్లో ఉండే వారు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. నగరంలోని పలు ఏరియాల్లో 50 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
సికింద్రాబాద్, జీడిమెట్ల, గాజులరామారం, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మియాపూర్, లింగంపల్లి, బాచుపల్లి, హఫీజ్‌పేట్, ఎల్బీ నగర్, సరూర్‌నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, కాప్రా, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, మౌలాలి, బేగంపేట్, ఉప్పల్, తార్నాక, ముషీరాబాద్, చిక్కడపల్లి, ప్యాట్నీ, ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోఠి, మోహిదీపట్నం, లంగర్‌హౌజ్, రాజేంద్రనగర్ ఏరియాల్లో వాన దంచికొడుతుంది. ఈ వర్షం రెండు గంటల పాటు కురిసే అవకాశం ఉంది.