Rain | హైదరాబాద్ : ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌లో రాత్రి వాన దంచికొట్టింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విధులు ముగించుకుని ఇళ్లకు చేరాల్సిన వారంతా వర్షంలో తడిసి ముద్దయ్యారు. మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాని అధికారులు సూచించారు.
రాత్రి కురిసిన భారీ వర్షానికి మోండా మార్కెట్లో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు . ఈ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నగరంలో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. వర్షం కారణంగా కొన్నిచోట్ల చెట్లు విరిగిపడడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
బుధవారం రాత్రి 30 నిమిషాల వ్యవధిలో సర్కిల్ 7 లోని బండ్లగూడలో 87.3 మి.మీ., అస్మాన్ఘడ్లో 82.5, మలక్‌పేటలో 82.3, సరూర్‌నగర్‌లో 77.8, ముసారాంబాగ్‌లో 75.8, ఎల్బీనగర్లో 69.0, చంపాపేటలో 66.3, హిమాయత్‌నగర్‌లో 61.0 మి.మీ. వర్షం పడింది. చాదర్‌ఘాట్ ఆర్యూబీ కింద వరద ప్రవహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.