సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాత్రి ఎనిమిదిన్నర నుంచి సుమారు రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షానికి నగరమంతా అతలాకుతలమైంది. దీంతో జనసంచారం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తు న్నాయి.
రాఖీ పండుగ సందర్భంగా ఇళ్లనుంచి బయటకు వచ్చిన పలువురు నగరవాసులు వర్షంలో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ సెంట్రల్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పాతబస్తీలో పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్‌జామ్ అయింది. భారీవర్షం కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాంపల్లి బేగంబజార్‌లో అత్యధికంగా 11.7 సెం.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, సీతాఫల్మండి, అబిడ్స్, నాంపల్లి, చిలకలగూడ, చార్మినార్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, వనస్థలిపురం, దిల్‌సుక్‌నగర్, చైతన్యపురి, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, అల్వాల్, తిరుమలగిరి,మాదాపూర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అమీర్‌పేట దగ్గర వరదనీరు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. యూఫ్గూడ కృష్ణానగర్‌లో వరదనీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
వర్షపాతం వివరాలిలా..
నగరంలోని పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి 11గంటల వరకు అందిన సమాచారం ప్రకారం నాంపల్లి బేగంబజార్‌లో 11.7సెం.మీ., చార్మినార్‌లో 10.6సెం.మీ, ఖైరతాబాద్ 9.4సెం.మీ, ఆసిఫ్‌నగర్ 9.1సెం.మీ, హయత్‌నగర్‌లో 9.0సెం.మీ, ముషీరాబాద్‌లో 8.6సెం.మీ, హిమాయత్‌నగర్‌లో 8.5సెం.మీ, అంబర్‌పేటలో 8.4సెం.మీ, బహదూర్‌పురలో 7.2సెం.మీ,అమీర్‌పేటలో 6సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
నిలిచిన వాహనాలు..భారీగా ట్రాఫిక్‌జామ్..!
పంజాగుట్ట ఫ్లైఓవర్ వరదనీరు పెద్ద ఎత్తున చేరింది. అమీర్‌పేటలో బస్సులు ముందుకుకదలకపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కనిపించింది. మలక్‌పేటలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మలక్‌పేట బ్రిడ్జి కింద పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో దిల్సుఖ్నగర్ వరకు రెండువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దిల్సుఖ్నగర్ చౌరస్తాలో, ఎల్‌బినగర్‌లో ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఉప్పల్ నుంచి తార్నాక వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు గంటపాటు కదలకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డబీర్‌పుర బ్రిడ్జి నుంచి దర్వాజా వరకు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. మైత్రివనం దగ్గర వరదనీరు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సిటీట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ స్వయంగా సిటీలో పలుచోట్ల ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే ప్రయత్నం చేశారు. ఎన్ఎఫ్సిఎల్ తదితర ప్రాంతాల్లో ఆయనతో పాటు ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ముందుకు కదిలేలా చేశారు.
పలుప్రాంతాల్లో పవర్‌కట్..!
గ్రేటర్‌లోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి ఎనిమిదిన్నర నుంచే సికింద్రాబాద్,బంజారాహిల్స్, మణికొండ, జూబ్లిహిల్స్, రాజీవ్‌నగర్, కాకతీయహిల్స్, అమీర్‌పేట, మైత్రివనం తదితర ప్రాంతాల్లో కరెంట్ పోయింది. దీంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. సుమారుగా 42 ఫీడర్లలో అంతరాయం ఏర్పడినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.