సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌ను ఆదివారం భారీ వర్షం అతలాకుతలం చేసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. పలు కాలనీలకు వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షేక్‌పేట, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం, టోలిచౌకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, నాంపల్లి, అబిడ్స్, గోషామహల్‌ను భారీ వర్షం కుదిపేసింది. హబీబ్‌నగర్ నాలాలో మాంగారిబస్తీకి చెందిన అర్జున్(26), రాము(25) గల్లంతయ్యారు. ముషీరాబాద్‌లోని వినోబానగర్‌కు చెందిన సన్నీ (23) నాలాలో ద్విచక్రవాహనంతో సహా కొట్టుకుపోయాడు.
ఉప్పల్, హయత్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, అఫ్జల్ గంజ్, నాంపల్లి, కోఠి, చందనాగర్, లింగంపల్లి, ఎంజే మార్కెట్, అబ్దుల్లాపూర్‌మెట్, పోచారం, మలక్‌పేటలో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. మోకాల లోతు నీరు నిలిచింది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షించారు. పలు కాలనీల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. సామగ్రి వర్షపు నీటితో తడిసి ముద్దయింది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మేడపల్లి వరకు వరంగ్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖాజాగూడలోని హరిజన్ బస్తీ నీట మునిగింది. వరద నీరు కాలనీల్లోని ఇండ్లలోకి చేరింది. నీటిని బయటకు .. పంపించేందుకు హరిజన్ బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కుండపోత వర్షానికి అతలాకుతలమైనా ఎక్కడా జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టలేదని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినా హైడ్రా, జీహెచ్ఎంసీలో కదలిక లేదని ఆరోపిస్తున్నారు. కాలనీల్లోకి వరద నీరు చేరినా తమకు ఎలాంటి సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గతంలో కురిసిన వర్షాలకు హైడ్రా, జీహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైందనే విమర్శలు వచ్చినా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం రెండు శాఖల అసమర్థతకు తార్కాణంగా నిలుస్తున్నది. ఆపత్కాలంలో స్పందించకుండా గొప్పలు చెప్పుకోవడంలో మాత్రం ముందు వరుసలో ఉంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయినా ట్రాఫిక్ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లో ఆదివారం రాత్రి కుంభవృష్టి వాన కురిసింది. రెండు గంటల వ్యవధిలోనే 12 సెం.మీలకు పైగా వర్షం కురవడంతో నగరం అతలాకుతలమైంది. రాత్రి 7 గంటల నుంచి 9గంటల వరకు కురిసిన వానతో నగరంలోని ముషీరాబాద్‌లో అత్యధికంగా 12.10 సెం.మీలు, జవహర్‌నగర్‌లో 11.28సెం.మీలు, ఉస్మానియా యూనివర్సిటీలో 10.18సెం.మీలు, మెట్టుగూడలో 9.55సెం.మీలు, షేక్‌పేటలో 9.43 సెం.మీలు, కాప్రాలో 9.15సెం.మీలు, హిమాయత్‌నగర్‌లో 7.73సెం.మీలు, నేరెడుమెట్లో 7.60సెం.మీలు, ఉప్పల్‌లో 7.58సెం.మీలు, అల్వాల్‌లో 7.18 సెం.మీలు, గచ్చిబౌలిలో 7.15 సెం.మీలు, నాంపల్లిలో 7.05 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ వెల్లడించింది.