JBS | హైదరాబాద్ : సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్సులు మాత్రం జీరో. ప్రయాణికులకు సరిపడ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక బస్సు వస్తే దాంట్లో సీట్ల కోసం ప్రయాణికులు పాట్లు పడుతున్నారు. చంటి పిల్లలను కిటికీల్లో నుంచి లోపలికి తోసేసి.. సీట్లల్లో కర్చీప్ వేస్తున్నారు.
రాఖీ పండుగ, ఆదివారం రావడంతో.. చాలా మంది తమ సొంతూర్లకు వెళ్లేందుకు బస్టాండ్లకు ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో జూబ్లీ బస్ స్టేషన్ జనంతో కిక్కిరిసి పోయింది. చంటి పిల్లలను ఎత్తుకొని బస్సుల కోసం ప్లాట్ ఫామ్‌పై గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు గంటలకు ఒక బస్సు రావడంతో ఆ బస్సు ఎక్కడానికి పోటీ పడుతున్నారు. చంటి పిల్లలను చిన్నారులను కిటికీలో నుండి బస్సు లోపలికి పంపిస్తున్నారు. డ్రైవర్ సీట్ పక్కన ఉండే ఇంజిన్‌పై కూర్చొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలకు వెళ్లేందుకు గంటల తరబడి జనం నిరీక్షిస్తున్నారు.