సిటీబ్యూరో, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): బ్రాండెడ్ షోరూం, లగ్జరీ రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, ఇంటర్నేషనల్ బ్రాండింగ్ సంస్థలతో తెలుగు రాష్ర్టాల్లో గుర్తింపు పొందిన ఆల్వాల్ – తిరుమలగిరి ప్రాంతంపై ఎలివేటెడ్ ప్రాజెక్టు ఎఫెక్ట్ గట్టిగానే పడింది. కోర్ సిటీలోనే ప్రధాన వ్యాపార కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ఈ ప్రాంతంలో ఏడాదికాలంగా టూ లెట్ బోర్డులు వేలాడుతున్నాయి. ప్రాజెక్టు వస్తుందనే కారణంగా, కూల్చివేతలకు భయపడి రెంటల్ అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటున్నారు. భూసేకరణ పూర్తి కాకుండానే కూల్చివేతలు అంటూ హెచ్ఎండీఏ హడావుడి చేస్తుండటంతో.. తమకొచ్చే ఆదాయం కూడా లేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. 13 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ కారణంగా జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు 1500కు పైగా ఆస్తులను కూలగొట్టేందుకు నోటీసులు జారీ చేయగా… వీటిలో ఉన్న వందలాది షోరూంలూ ఉన్న ఫళంగా ఖాళీ చేయడంతో టూ లెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు ఇదే జీవనాధారంగా బతికిన వందలాది కుటుంబాల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందనీ, అదే ప్రాజెక్టు వెడల్పు విషయంలో స్పష్టమైన ప్రకటన చేస్తే… కొంతవరకు తమ ఆస్తులు మిగులుతాయని రాజీవ్ రహదారి వెంబడి ఉన్న వందలాది మంది బాధితులు చెబుతున్నారు.
ప్రభుత్వం భూ సేకరణ చేయకుండానే ఎలివేటెడ్ ప్రాజెక్టు పేరిట ఏడాదిన్నర కాలంగా ఊరిస్తూనే… వాణిజ్య కేంద్రమైన ప్రాంతంలో ఆస్తులను లాగేసుకుంటోంది. దీంతో వారసత్వంగా వచ్చిన ఆస్తులు మాత్రమే కోల్పోవడం లేదని, అంతకు మించిన ఆదాయం కూడా లేకుండా పోతుందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇక ప్రాజెక్టు విషయంలోనూ మూస ధోరణిని అమలు చేస్తుండగా… హెచ్ఎండీఏ ప్రణాళికలు తమ పాలిట శాపంగా మారాయని మండిపడుతున్నారు. ఎలివేటెడ్ ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన పాతదే. కానీ ప్రాజెక్టు వెడల్పుపైనే అభ్యంతరాలను ఇప్పటికీ పరిష్కరించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ ఈ అంశంపై ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని, పరిహారం కూడా ఎటూ తేల్చకుండానే ప్రాజెక్టు పేరిట హడావుడి చేస్తుండటంతో గడిచిన ఏడాది కాలంగా వ్యాపారమే లేకుండా పోయిందని చెబుతున్నారు.
కోర్ సిటీ తరహాలోని ఐటీ కారిడార్, హిమయత్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తరహాలో జేబీఎస్ నుంచి శామీర్పేట మార్గం కమర్షియల్ కేంద్రంగా విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో వందలాది బ్రాండెడ్ షోరూంలూ, లగ్జరీ రెస్టారెంట్లు, హోటళ్లతోపాటు వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. వీటితోపాటు ఆస్తుల యజమానులకు కూడా ఇదొక ప్రధాన ఆదాయ వనరుగానే ఉంది. కానీ ఎలివేటెడ్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారించే తీరు… వేలాది కుటుంబాలు రోడ్డున పడేలా చేస్తోంది. ముఖ్యంగా రెంటల్, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టు ద్వారా కోల్పోతున్నామని వాపోతున్నారు. ఇక ఏటా వచ్చే రెంటల్ ఇన్కం కూడా లేకుండా పోతుందని మండిపడుతున్నారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందే తమ కుటుంబాలను రోడ్డున పడేసేలా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. కనీసం నెలవారీ అద్దెలు కూడా చెల్లించేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదన్నారు. ఓవైపు ఆస్తి పన్ను విషయంలో కంటోన్మెంట్, జిల్లాల అధికారులు నోటీసులు జారీ చేస్తుండగా… రెంటల్ ఇన్కం కోల్పోతూనే, అదనంగా ఆస్తి పన్నులను వేలల్లో చెల్లించాల్సి వస్తుందని, కిరాయిలు చెల్లించాల్సిన వ్యాపారులు కూడా అత్తెసరు పైసలు చేతిలో పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అస్పష్టమైన విధివిధానాలతోనే తమ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు.
భూసేకరణ చట్టం ప్రకారం ఆస్తుల పరిహారంతోపాటుగా ప్రాజెక్టు విధివిధానాలపై భూ నిర్వాసితులతో ముందుగా చర్చించిన తర్వాత సేకరణ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలివేటెడ్ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి చర్చలు లేకుండానే హడావుడిగా ఆస్తులను సేకరించాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో యజమానుల్లో గందరగోళానికి కారణమైంది. దీంతో చాలామంది భూ యజమానులు కోర్టులను ఆశ్రయించారని జేఎసీ వర్గాలు వివరించాయి. ప్రభుత్వం కూడా పరిహారం, వెడల్పు విషయంలో పునరాలోచన చేసేంత వరకు తమ ఆస్తులను ఇచ్చేది లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు కారణంగా ఏడాది కాలంగా లక్షలాది రూపాయల ఆదాయం లేకుండా పోయిందని జేఎసీ చైర్మన్ తేలుకుంట సతీష్ వివరించారు. ఇప్పటికీ వందలాది దుకాణాలు ఖాళీగానే ఉన్నాయి. ఇక అగ్రిమెంట్లను ముందుస్తుగానే రద్దు చేసుకుని వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుపై ఎలాంటి స్పష్టత లేకుండా ఆస్తులను సేకరించడం వలనే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తెలిపారు. జేఎసీ ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని, ఇదే జీవనాధారంగా ఉన్న తమకు విలువైన భూములు, ఆస్తులు లేకుండా పోతున్నాయన్నారు. ప్రాజెక్టు వెడల్పు విషయంలోనే మెజార్టీ భూ యజమానుల్లో వ్యతిరేకత ఉందనీ, ఈ విషయంలో స్పష్టతనిస్తే గానీ తమకు ప్రయోజనం ఉండదన్నారు.