Boduppal |బోడుప్పల్, సెప్టెంబర్ 28 : బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని లక్ష్మీగణపతి కాలనీకి పెనుప్రమాదం పొంచి వుంది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీకి ఆనుకుని 3ఎకరాల విస్తీర్ణంలో 25 ఫీట్ల లోతుగా గోతులు తీసి నిర్లక్ష్యంగా వదిలేసిన భారీ సెల్లార్ నిండుకుండలా మారి చెరువును తలపిస్తుంది. దీంతో లక్ష్మీగణపతి కాలనీకి చెందిన 15 ఇండ్లు ప్రమాదపుటంచునకు చేరుకున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇంటి యజమానులు ఇంటి బయటకు వచ్చి నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిరసనలు తెలుపుతున్నా.. ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం.
ప్రమాదం పొంచి వున్నా .. అధికారులు పట్టించుకోరా..?
ప్రాణపాయ స్ధితిలో ఉన్నామని అధికారులకు రెండు సంవత్సరాలుగా పలుమార్లు విన్నవించుకున్నా స్పందిచివారు లేరని కాలనీ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి విమర్శించారు. కృతికా ఇన్ఫ్రా కంపెనీ 2 సంవత్సరాల క్రితం 3 ఎకరాల్లో నిబంధనలకు విరుద్దంగా 25 ఫీట్ల లోతులో ప్రమాదకరంగా సెల్లార్ తీసి వదిలేసిన యాజమాన్యంపై ఏ ఒక్క అధికారి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ముడుపులకు అలవాటు పడిన అధికారులకు ప్రజల ప్రాణాలు లెక్కలేదా అని అయన నిలదీశారు. భూ యజమాని సత్యారెడ్డి బాగస్వాములు, కృతికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డర్స్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తాం…
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సెల్లార్ సమస్యను పరిష్కరించకుంటే కాలనీవాసులతో కలిసి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ విధ్య, స్థానిక బీఆర్ఎస్ నాయకుడు చక్రపాణి గౌడ్ హెచ్చరించారు. ఆదివారం లక్ష్మీగణపతి కాలనీవాసులు తెలిపిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. సమస్య తీవ్రతను రెండు సంవత్సరాలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా కేవలం నోటీసులు ఇచ్చి సరిపెడుతున్నారని విమర్శించారు. 3 ఎకరాల విస్తీర్ణంలో నిలిచిన నీటిని తక్షణమే తొలగించి కాలనీవాసులకు భరోసా ఇవ్వాలని లేని యెడల ప్రజల నుండి తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.