మేడ్చల్, అక్టోబర్ 4 : బీఆర్ఎస్ హయాంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో చామకూర గోపాల్ ఏర్పాటు చేసిన సీఎంఆర్ మెడికల్ కళాశాలలను మంత్రి హరీశ్‌రావు, మంత్రులు మల్లారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో కేవలం 2,850 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవన్నారు. వైద్య విద్యను అందుబాటులో లేని కారణంగా రాష్ర్టానికి చెందిన విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పిన్స్ తదితర దేశాలకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చేదన్నారు. పేద విద్యార్థులకు వైద్యవిద్యను అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ పూనుకున్నారన్నారు.
గతంలో 2850 మెడికల్ సీట్లు ఉంటే ప్రస్తుతం 10వేలు మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీంతో రాష్ర్టానికి చెందిన విద్యార్థులు ఎవరి జిల్లాలో వారే చదువుకునే అవకాశం కల్పించారన్నారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కూడా 50 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఒక్కో మెడికల్ కళాశాలకు అనుబంధంగా 500 పడకల ఆస్పత్రి ఉంటుందన్నారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆస్పత్రుల ద్వారా నగరంపై భారం కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందజేస్తుందని ఆయన చెప్పారు.
విద్య, వైద్య రంగాల్లో అనూహ్య ప్రగతి
సీఎం కేసీఆర్ హయాంలో విద్య, వైద్య రంగాల్లో అనూహ్య ప్రగతి రాష్ట్రం అనూహ్య ప్రగతి సాధించిందని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేట్‌లోనూ ప్రభుత్వం కల్పిస్తున్న 50 శాతం కన్వీనర్ కోటాను విద్యార్థులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సీఎంఆర్, మల్లారెడ్డి మెడికల్ కళాశాలల ద్వారా ఉచితంగా వైద్యం అందజేస్తున్నామన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.
సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ఐటీ హబ్‌గా మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, డాక్టర్ చామకూర భద్రారెడ్డి, సీఎంఆర్ కార్యదర్శి చామకూర గోపాల్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్‌రెడ్డి, మోహన్ రెడ్డి, ఫిలిప్స్, సుధాకర్, మేడ్చల్, గుండ్లపోచంపల్లి కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.