Fake Doctors | సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కొందరు ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ క్లినిక్లలో వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడిచిన సంవత్సరం కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వైద్యులపై 430ఎఫ్ఐఆర్లు నమోదు కాగా అందులో 200కు పైగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల పరిధిలోనే నమోదు కావడం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 50 శాతం కంటే ఎక్కువ కేసులు కేవలం మూడు జిల్లాలో నమోదయ్యాయంటే ఈ ప్రాంతాల్లో నకిలీ వైద్యులు ఏ స్థాయిలో తిష్టవేశారో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో కార్పొరేట్, ప్రైవేటుతో పాటు ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ స్పెషాలిటీ దవాఖానలు ఉండడంతో నగరంలో నకిలీల హవా పెద్దగా నడవడం లేదు.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన వైద్య, ఆరోగ్యశాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది అర్హత లేని నకిలీ వైద్యులతో అంటకాగుతూ, వారి నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ నకిలీ వైద్యులు యథేచ్ఛగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అందినకాడికి దండుకుంటున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోకపోవడమే కాకుండా ఏదైనా ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేసే అధికారులు తూతూ మంత్రంగా క్లినిక్లు, దవాఖానలను సీజ్ చేస్తున్నారని, రెండు మూడు రోజులకే మళ్లీ అవి తెరుచుకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే మేము సీజ్ చేశాం, మళ్లీ తెరిచిన విషయంపై మాకు ఫిర్యాదు అందలేదని నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
కొందరు అధికారులు, సిబ్బంది అడిగినంత ముట్టజెప్పకుంటేనే అప్పుడు వారికి రూల్స్ గుర్తొస్తున్నాయని, వాటిని అడ్డం పెట్టుకుని క్లినిక్లు, దవాఖానలను సీజ్ చేసి, నిర్వాహకులను తమ దారికి తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.