Banjarahills | బంజారాహిల్స్, జూన్ 13 : కార్లను అద్దెకు తీసుకుని పక్క రాష్ట్రంలో అమ్మేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్‌కు చెందిన రషీద్ అనే వ్యక్తి బంజారాహిల్స్‌లో కార్యాలయం పెట్టి కార్లను లీజుకు ఇచ్చే వ్యాపారం నిర్వహిస్తుంటారు. గత ఏడాది నవంబర్‌లో బండ్లగూడకు చెందిన మహ్మద్ జాహెద్ అలీ అనే వ్యక్తికి డిఫెండర్, ఫోర్డ్ ఎండీవర్ కార్లను అద్దెకు ఇచ్చాడు. అప్పటినుంచి నెలనెలా జాహెద్ అద్దె చెల్లిస్తున్నాడు.
ఈ క్రమంలో ఇటీవల మహారాష్ట్రకు వెళ్లిన జాహెద్ అలీ అద్దెకు తీసుకువెళ్లిన రషీద్‌కు చెందిన రెండుకార్లను వేరేవ్యక్తులకు అమ్మేశాడు. అయితే కార్లు అమ్మిన విషయం తెలియని రషీద్ అద్దె కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో ఇదే విధంగా కార్లను వేరొకరికి అమ్మేస్తూ పట్టుబడిన జాహెద్ అలీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేయగా బంజారాహిల్స్ నుంచి రెండుకార్లను తెచ్చి అమ్మేసినట్లు తేలింది. దీంతో కారు యజమాని రషీద్‌కు మహారాష్ట్ర పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో తనను నమ్మించి అద్దెకు కారు తీసుకుని మోసం చేసిన జాహెద్ అలీ మీద చర్యలు తీసుకోవాలని బాధితుడు రషీద్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.