ఫేస్బుక్లో విచ్చలవిడిగా నకిలీ అకౌంట్లు
పేరుప్రఖ్యాతులు, యాక్టివ్‌గా ఉండేవారే టార్గెట్
ఫ్రెండ్స్ లిస్ట్, ఫొటోలతో తస్మాత్ జాగ్రత్త
ఫేక్ అకౌంట్ కనిపిస్తే రిపోర్ట్ చేయించాలి..
కొంతకాలంకిందట ఓ జిల్లా ఎస్పీనుంచి కొందరికి ఫేస్బుక్ రిక్వెస్ట్‌లు వచ్చాయి. ఎస్పీ అంతటివ్యక్తినుంచి రిక్వెస్ట్ ఎవరు వద్దనుకొంటారు. వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత ఎస్పీ అకౌంట్నుంచి రెండు, మూడు కొటేషన్లు రావడంతో ఫిదా అయిపోయారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. డబ్బు కావాలి త్వరలోనే సర్దుతాను అని మెసేజులు వచ్చాయి. దీంతో ఖంగుతిన్న సదరు వ్యక్తులు విషయాన్ని పోలీసుల దృష్టికి తేవడంతో ఇది నకిలీల పనేనని తేలింది. ఇలా ఒకటికాదు రెండు కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు వెయ్యికిపైగా కేసులు పోలీస్స్టేషన్లలో నమోదు అవుతున్నాయి.
ఫేక్ అకౌంట్లు ఎంతటి నష్టం కలిగిస్తున్నాయో ఇటీవలికాలంలో ఫేస్బుక్ వినియోగదారుల్లో చాలామందికి అనుభవంలోకి వస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో నకిలీ అకౌంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మంచి ఉద్యోగం లేకపోతే వ్యాపారం ఉండి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారే నకిలీల టార్గెట్. ఆ వ్యక్తులు వివిధ సందర్భాల్లో అప్లోడ్ చేసిన ఫొటోలను సేకరించి, అచ్చం అదే పేరు, వారి ఫొటోలతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్‌ను క్రియేట్ చేస్తున్నారు. పాత ఫొటోలను ఉపయోగించుకొని నాలుగైదు పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ తర్వాత వారి ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నవారికి, ఇతరులకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. యాక్సెప్ట్ చేయగానే హాస్పిటల్లో ఉన్నాననో లేదా ఏదో ఒక కారణం చెప్పి డబ్బు అత్యవసరంగా కావాలని, ఒకటి రెండు రోజుల్లోనే ఇచ్చేస్తానని మెసేజ్ పెడుతున్నారు. ఫోన్ పే లేదా గూగుల్ పే నంబర్ ఇచ్చి మరీ డబ్బు అడుగుతుంటారు. ఒక్కసారి డబ్బు వేస్తే.. ఇక అంతే. ఇలా ఫేక్ అకౌంట్లను నమ్మి వేలకు వేలు పోగొట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పోలీసులకు ఇలాంటివి రోజుకు వెయ్యిపైగా ఫిర్యాదులు వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ఫేక్ అకౌంట్లను కట్టడిచేసేందుకు నిపుణులు పలుమార్గాలు సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మీ పేరుపై ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినట్టు గుర్తిస్తే వెంటనే అందరికీ తెలియజేయాలని స్పష్టం చేస్తున్నారు.
ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయకుండా..
1) ఫ్రెండ్స్ లిస్ట్‌ను దాచడం: నకిలీ అకౌంట్‌ను సృష్టించే కేటుగాళ్లకు మీ ఫ్రెండ్సే టార్గెట్. కాబట్టి మీ ఫ్రెండ్స్ లిస్ట్ ఇతరులకు కనిపించకుండా ‘హైడ్’ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఫ్రెండ్స్ లిస్ట్ దగ్గర ఆప్షన్స్‌లో ‘ఎడిట్ మై ప్రైవసీ’లోకి వెళ్లి ‘హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్స్ లిస్ట్’లో ‘ఓన్లీ మీ’ అని ఎంచుకోవాలి. దీంతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకునేవారికి మీ స్నేహితుల వివరాలు తెలియకుండా ఉంటాయి.
2) ఫొటోలు భద్రం: మీ టైమ్‌లైన్‌పై పోస్ట్ చేసే ఫొటోల భద్రత మీదే బాధ్యత. కాబట్టి ఫొటోలను కేవలం మీ స్నేహితులు మాత్రమే చూసేలా ఆప్షన్లలో ‘ఎడిట్ పోస్ట్ ఆడియన్స్’లో ఫ్రెండ్స్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. పబ్లిక్‌గా పెట్టుకుంటే చేయగలిగేది ఏమీ ఉండదు.
3) ప్రొఫైల్ లాక్: మీ అకౌంట్‌ను భద్రంగా ఉంచుకోవడానికి చివరి ఆప్షన్‌గా మాత్రమే దీనిని వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రొఫైల్ లాక్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు.
ఒకవేళ ఫేక్ అకౌంట్ క్రియేట్ అయితే..
1) ఒకవేళ మీ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ అయిందని భావిస్తే వెంటనే మీ టైమ్‌లైన్‌పై తెలియజేయండి. ఫలానా పేరుతో, ఫలానా ప్రొఫైల్ పిక్‌తో కనిపిస్తున్న అకౌంట్ నాది కాదు.. అని స్పష్టం చేయాలి.
2) ఆ అకౌంట్లో ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్‌కు కచ్చితంగా సమాచారం ఇవ్వాలి. అవసరమైతే కాల్ చేసి కన్ఫర్మ్ చేయాలి.
3) ఫేక్ అకౌంట్ అడ్రస్‌ను టైమ్‌లైన్‌పై లేదా ఫ్రెండ్స్‌కు మెసేజ్ ద్వారా పంపి.. కనీసం 20-50 మందితో రిపోర్ట్ చేయించాలి. దీంతో ఫేస్బుక్ ఆ అకౌంట్‌ను పరిశీలించి డిలీట్ చేస్తుంది.
4) ఫేక్ అకౌంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం. ఇలాంటివి రోజూ వందలసంఖ్యలో వస్తుంటాయి. అంతేకాదు.. ఐపీ అడ్రస్, ఇతర సాంకేతిక అంశాలు కావాలని వారు కోరితే ఫేస్బుక్ సరిగా స్పందించడం లేదు. కాబట్టి స్వీయ జాగ్రత్తలే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
5) ఆన్లైన్ మోసాలపై సైబరాబాద్ పోలీసులకు 94906 17444 నంబర్, ఆర్థిక నేరాలపై 94936 25553 నంబర్‌కు వాట్సాప్ చేయొచ్చు.
యాక్సెప్ట్ చేసేముందు జరభద్రం
1) అమ్మాయిల అకౌంట్లతో జాగ్రత్త: అమ్మాయిల పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే వెనుకాముందూ ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసేవాళ్లు ఎందరో ఉన్నారు. వారి ప్రొఫైల్ పిక్స్, టైమ్‌లైన్ ఫొటోస్ గూగుల్ నుంచి తీసుకున్నవి కావొచ్చు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒకటి రెండు రోజులు పద్ధతిగా చాటింగ్ చేసి.. ఆ తర్వాత డబ్బులు, వస్తువులు అడుగుతారు. అవసరమైతే వాయిస్ కాల్ కూడా చేస్తారు.
2) హిస్టరీని చెక్ చేయండి: ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఆ అకౌంట్ క్రియేట్ చేసి ఎన్ని రోజులైంది? ఫ్రెండ్స్ ఎంతమంది? టైమ్‌లైన్ పోస్టులు వంటివి చెక్ చేయాలి. వారం పది రోజుల కింద అకౌంట్ మొదలు పెట్టి, 10-15 మంది ఫ్రెండ్స్ ఉండి, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఒకరిద్దరు మాత్రమే ఉంటే కచ్చితంగా అనుమానించాలి.
3) ప్రొఫైల్ లాక్: ప్రముఖుల ఫొటోలతో అకౌంట్ క్రియేట్ చేసి, ప్రొఫైల్ లాక్ చేసి రిక్వెస్ట్ పంపుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మొహమాటానికి పోయి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఫేస్బుక్లో సెర్చ్ చేసి, పేరు, ప్రొఫైల్ పిక్ వంటివి సరిచూసుకున్న తర్వాతే యాక్సెప్ట్ చేయాలి.
రిపోర్ట్ కొట్టడమే మేలు
ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేముందే ఒకటికి రెండుసార్లు హిస్టరీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ పేరుపై నకిలీ అకౌంట్ క్రియేట్ అయితే కనీసం 20-50 మందితో రిపోర్ట్ కొట్టించాలి. ఒకరిద్దరు రిపోర్ట్ కొడితే ఫేస్బుక్ టూల్స్ పెద్దగా స్పందించవు. కనీసం 20 మంది దాటితే ఆటోమేషన్ నుంచి మ్యాన్యువల్ స్టేజ్‌కి వెళ్తుంది. ఫేస్బుక్ ఉద్యోగి ఆ అకౌంట్‌ను చెక్ చేసి చర్య తీసుకుంటారు. 99 శాతం సందర్భాల్లో ఇది విజయవంతమైంది. పోలీసులకు హైదరాబాద్‌లో రోజుకు 1200-1500 వరకు ఫేక్ అకౌంట్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నింటిపై ఎంక్వైరీ చేయడం డిపార్ట్మెంట్కు సాధ్యం కాదు. అంతేకాదు ఫేస్బుక్ సంస్థ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదు. కాబట్టి మన జాగ్రత్తే మనల్ని కాపాడుతుంది.
-నల్లమోతు శ్రీధర్, ప్రముఖ ఐటీ నిపుణుడు