Hyderabad | వెంగళరావునగర్, ఏప్రిల్ 24: పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు అతడిని కర్రలతో చితకబాది గాయపడిన యువతిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నది. హైదరాబాద్ బోరబండ బంజారానగర్‌లో సోమవారం ఈ దారుణం జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండ రామారావునగర్‌కు చెందిన సిద్ధప్ప, శాంతమ్మ కూతురు లక్ష్మి (25)తో బోరబండ మోతీనగర్‌లో ఉంటున్న కిశోర్ (28)కు ఏడేండ్లుగా పరిచయం ఉన్నది. గతంలో కిశోర్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో లక్ష్మి పనిచేసేది. ప్రస్తుతం లక్ష్మి మాదాపూర్‌లో హౌస్ కీపింగ్ పనిచేస్తున్నది.
ఏడేండ్లుగా కిశోర్ ప్రేమి స్తున్నానంటూ లక్ష్మి వెంటపడేవాడు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఆమెపై పగ పెంచుకున్నాడు. సోమవారం సాయంత్రం లక్ష్మి, తన తల్లి శాంతమ్మను తీసుకొని స్కూటిపై వస్తుండగా.. కాపుకాసిన కిశోర్ బైక్‌తో వీరిని వెంబడించాడు. బంజారానగర్ మెయిన్రోడ్లో లక్ష్మి స్కూటికి తన బైక్‌ను అడ్డుపెట్టి ఆపాడు. కిందకు దిగిన కిశోర్ లక్ష్మి కండ్లలో కారం కొట్టడంతో తల్లీబిడ్డ కింద పడిపోయారు. కత్తితో లక్ష్మి గొంతు కోసేందుకు ప్రయ త్నించాడు. లక్ష్మికి హెల్మెట్ ఉండటంతోపాటు ఆమె అతని నుంచి తప్పించుకు నేందుకు విఫలయత్నం చేసింది. అప్రమత్తమైన స్థానికులు కిషోర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అప్పటికే లక్ష్మి గొంతుకు గాయమైంది. బాధితురాలిని దవాఖానకు తరలించి, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.