HCU | కొండాపూర్, ఏప్రిల్ 1: హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతంగా సాగుతున్నది. తరగతులను బహిష్కరించి మెయిన్ గేట్ వద్దకు భారీ ర్యాలీగా తరలి వచ్చి అక్కడే బైఠాయించి కాంగ్రెస్ పాలనకు, సీఎం రేవంత్రెడ్డి నియంతృత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హెచ్సీయూ నుంచి పోలీసులు వెళ్లిపోవాలంటూ నినదించగా పోలీసులు, విద్యార్థులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయగా విద్యార్థులను వర్సిటీలోకి నెట్టేసి ప్రధాన గేట్ మూసేయగా.. వారు విశ్వవిద్యాలయం లోపల టెంట్ వేసుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమానికి పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల యూనియన్లు మద్దతు తెలిపాయి.
ఇందులో భాగంగా మంగళవారం సీపీఎం, సీపీఐ, బీజేవైఎం, బీజేపీ, పీఎస్యూ స్టూడెంట్ యూనియన్ల ప్రతినిధులు సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఈడ్చుకుంటూ తీసుకు వెళ్లి వాహనాల్లో పడేశారు. నార్సింగి, కొల్లూరు పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో వర్సిటీ ప్రధాన గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ముమ్మరంగా సాగుతున్న పనులు..
ఒకవైపు హెచ్సీయూ భూములను వేలం వేయవద్దంటూ వేలాది మంది విద్యార్థులు ఆందోళన చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం భారీ బందోబస్తు మధ్య వందలాది జేసీబీలతో అడవులను తొలగిస్తూ, వన్య ప్రాణుల నివాసాలను తుడిచేస్తూ వేగంగా పనులను కొనసాగిస్తున్నారు.
వన్యప్రాణుల మృత్యువాత..
యూనివర్సిటీలోని భూముులు చదును చేస్తుండడంతో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నారు. జేసీబీలతో పనులు చేస్తుండగా జింక మృతి చెందిందని విద్యార్థులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్గా మారుతున్నాయి. పచ్చని అడవి, జీవ వైవిధ్యం దెబ్బతింటుంటే తెలంగాణ సమాజం నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి
హెచ్సీయూకి చెందిన 400 ఎకరాల భూములను విశ్వవిద్యాలయానికే అప్పగించాలి. ఈ భూములను ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం సిగ్గుచేటు. యూనివర్సిటీ భూముల కోసం ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దుర్మార్గం. శత్రువులపై యుద్ధానికి వెళ్లినట్లు ప్రభుత్వం బుల్డోజర్లతో దండెత్తడం ఎంతవరకు సమంజసం. రేవంత్రెడ్డి కుట్రలను ప్రతిఒక్కరూ తిప్పికొట్టాలి.
– ఎమ్మెల్యే ముఠాగోపాల్
మేం వ్యతిరేకం..
భూముల అమ్మకానికి మేం వ్యతిరేకం..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమి అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్న విద్యార్థులను అరెస్టు చేయడం బాధాకరం. హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల్లో ఎంతో జీవ వైవిధ్యం ఉన్నది. పర్యావరణానికి హాని కలిగించేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం ఎంతవరకు సమంజసం?. విద్యార్థుల పోరాటాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
– కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే