HCU | కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల స్థలం ప్రభుత్వానిదే అని టీజీఐఐసీ చేసిన ప్రకటనపై హెచ్సీయూ రిజిస్ట్రార్ స్పందించారు. 2024 జూలై అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు భూమి ఎలా ఉందనే దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని వివరించారు.
భూ హద్దులను హెచ్సీయూ అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని రిజిస్ట్రార్ తెలిపారు. ఇప్పటివరకు భూమి సరిహద్దులను గుర్తించలేదని తెలిపారు. దీనిపై హెచ్సీయూకి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఆ భూమిని వర్సిటీకే ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నామని పేర్కొన్నారు. భూమిని కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు.
టీజీఐఐసీ ఏం చెప్పిందంటే..
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని టీజీఐఐసీ స్పష్టం చేసింది. ఆ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా ప్రభుత్వం నిరూపించుకుందని తెలిపింది. ప్రైవేటు సంస్థకు 21 ఏండ్ల క్రితం కేటాయించిన భూమిని దక్కించికుందని పేర్కొంది. అభివృద్ధఙకి ఇచ్చిన భూమిలో చెరువులు లేవన్నారు. సర్వేలో ఒక అంగుళం భూమి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలిందని చెప్పింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక ఇక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదని స్పష్టం చేసింది.
ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని టీజీఐఐసీ చెప్పింది. ప్రాజెక్టును వ్యతిరేకించే కొందరు రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉందని.. అది అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడింది. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉందని తెలిపింది.
Hcu Pressnote