సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్సిటీ ప్రాజెక్టు ఆదిలోనే అబాసుపాలవుతుంది. ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా పలు చోట్ల రహదారులను విస్తరించాలని నిర్ణయించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పనుల్లో భాగంగా పలు చోట్ల భూ సేకరణ అనివార్యమైంది. 1391 చోట్ల ఆస్తులను గుర్తించిన అధికారులు భూ సేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పథకాలకు చేపట్టే భూ సేకరణ సందర్భంగా ఇచ్చే నగదు నష్ట పరిహారానికి బదులుగా ప్రవేశపెట్టిన ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అమలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీఆర్‌లకు ఇక్కడి బాధితులు ఒపుకున్నారు. నగదు రూపంలో నష్ట పరిహారం అందజేస్తేనే రహదారి విస్తరణ పనులకు సహకరిస్తామని తేల్చి చెబుతున్నారు. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న బల్దియాకు ప్రభుత్వ నుంచి నిధులు మంజూరు జరగకపోవడం, ప్రాజెక్టు పనులు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
మొత్తంగా పాతబస్తీలో భూ సేకరణ కష్ట సాధ్యంగా మారడం, హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితులు కనబడడం లేదని ఇంజినీరింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పథకాలకోసం చేపట్టే ఆస్తుల సేకరణ సందర్భంగా జీహెచ్ఎంసీ టీడీపీఆర్ పత్రాలను అందజేస్తున్నారు. అభివృద్ధి పనులకు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమిని సేకరించి, నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా ఈ టీడీఆర్‌ను ఇస్తున్నారు.
ఏదైన ఒక నిర్వాసితుడు నాలా విస్తరణ వల్ల ఏ మేరకు స్థలాన్ని కోల్పోయాడో, అంతకు నాలుగు రెట్లకు టీడీఆర్ పత్రాలను పరిహారంగా పొందుతాడు. ఉదాహరణకు ఆమీర్పేటలో 20 గజాల స్థలాన్ని కోల్పోయిన నిర్వాసితుడు జీహెచ్ఎంసీ ఇచ్చే 80 గజాల టీడీఆర్ పత్రాన్ని తీసుకుని ఇతరులకు విక్రయించుకునే హక్కు పొందుతాడు. టీడీఆర్ పత్రం కలిగిన వారు, జీహెచ్ఎంసీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ఇచ్చే అనుమతికి అదనంగా చేపట్టే నిర్మాణ వైశాల్యాన్ని నిబంధనలను అనుసరించి క్రమబద్దీకరించుకోవచ్చు. ఫలితంగా లక్ష రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో..టీడీఆర్ ద్వారా అంతకు రెట్టింపు లేదా, తనకు నచ్చిన మొత్తానికి విక్రయించుకుని లాభపడుతున్నారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఆలస్యంగా వస్తుండడంతో ఆస్తుల సేకరణ సందిగ్ధంలో పడింది.