Urban Parks | మేడ్చల్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మరిన్ని పార్కుల ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పచ్చదనం పెంపునకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో 8093.38 హెక్టార్ల అటవీ భూమి ఉండగా.. ఇందులో 40 ఫారెస్ట్ బ్లాకులు ఉన్నాయి. నగరంలో పెరుగుతున్న కాలుష్యన్ని తగ్గించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందలాది ఎకరాల్లో 15 అర్బన్ పార్క్‌లు ఏర్పాటు చేయగా.. యాద్గర్‌పల్లి, గౌడవెల్లిలో నూతనంగా నిర్మిస్తున్న అర్బన్ పార్క్‌లు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అర్బన్ పార్కుల నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వాకింగ్ ట్రాక్‌లు, సైకిల్ ట్రాక్‌లు ప్రజలకు సౌకర్యవంతంగా మారాయి. దీంతో పాటు మరిన్ని అర్బన్ పార్కుల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న అటవీ భూములను గుర్తిస్తున్నారు.
వచ్చే హరితహారం కార్యక్రమంలో అర్బన్ పార్కులలో లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు 90 శాతం పెరిగి వృక్షాలుగా మారినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అర్బన్ పార్క్‌లలో లక్ష మొక్కలు నాటేందుకు మాత్రమే స్థలం ఉన్నదని పేర్కొన్నారు.