Harish Rao | కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని అన్నారు. మొన్న కొండా సురేఖ బిడ్డ, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశారు కదా అని తెలిపారు. క్యాబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు బట్టలూడదీసుకొని తిట్టుకున్నారట అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజల గురించి చూడటం లేదని.. వాళ్లు తన్నుకోడానికి, వాటాలు పంచుకోవడానికి సరిపోతుందని విమర్శించారు. మల్లా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.
తెలంగాణ భవన్ లో వడ్డెర సంఘం సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరిలాగా పైకి రావాలి.. మేలు జరగాలని మీరు కోరుకుంటున్నారని వడ్డెర కులస్తులను ఉద్దేశించి అన్నారు. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం వడ్డెర సమాజానికి సహాయం చేసిందని తెలిపారు. సిద్దిపేటలో ట్రాక్టర్లు అందించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొరం కొట్టుకునే తమపై అక్రమ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని వడ్డెర సోదరుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో బిల్డింగులు నిర్మించేవాళ్లకు, మీకు చేతినిండా కూడా పని దొరికేదని అన్నారు.
కేసీఆర్ హైదరాబాద్‌లో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇల్లులు కట్టిండని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి లక్ష ఇండ్లను కూలగొట్టిండని పేర్కొన్నారు. పేదల ఇండ్లు కూల్చొద్దంటే, హైడ్రా బందు కావాలంటే కాంగ్రెస్ ను ఓడకొట్టాలే అని విమర్శించారు. హైదరాబాద్‌లో ఇల్లులు కూలగొట్టినా ప్రజలు నాకే ఓటేసిర్రని రేవంత్ రెడ్డి విర్రవీగుతాడని చెప్పారు.
ఎన్నికల ముంగట మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని గ్యారెంటీ కార్డు ఇచ్చారని హరీశ్‌రావు అన్నారు. రెండువేల పెన్షన్ రూ.4000 చేస్తామన్నారని.. చేశారా కాంగ్రెస్ వాళ్లు అని ప్రశ్నించారు. 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ 2000 చేసిండని చెప్పారు. 4000 పెన్షన్ ఇవ్వకపోయినా మహిళలకు 2500 ఈయకపోయినా నాకే ఓటేశారు అని రేవంత్ రెడ్డి అంటాడని తెలిపారు. మహిళలకు 2500 రావాలన్నా, వృద్ధులకు 4000 పెన్షన్ రావాలన్నా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. ఓటుతో రేవంత్ రెడ్డి చెంపలు వాయించి బుద్ధి చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి డబ్బు మూటలను, గుండాలను నమ్ముకున్నారని తెలిపారు.