Bodrai Festival | హైదరాబాద్ హయత్ నగర్లో బొడ్రాయి పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ క్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ బొడ్రాయి పండుగను సంయుక్తంగా నిర్వహించిన కుల పెద్దలకు, ఈ ప్రాంత ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ దేవత అమ్మవారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
గతంలో ఏదైనా మంచి జరగాలని గ్రామాల్లో ఈ బొడ్రాయి పండుగను నిర్వహించేవారని హరీశ్‌రావు తెలిపారు. అలాంటి సంప్రదాయాన్ని అందరూ పాటించి ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరా పండుగ అయినా బతుకమ్మ పండుగ అయిన బొడ్రాయి పండుగ అయిన కుటుంబం అంతా సంతోషంగా జరుపుకునే ఆనవాయితీ తెలంగాణలో ఉందన్నారు. ఈ బొడ్రాయి పండుగకు ఆహ్వానించినందుకు సుధీర్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని అన్నారు. మీ అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మన హైదరాబాద్ కు పూర్వ వైభవం రావాలని, పెద్ద పెద్ద కంపెనీలు రావాలి పెట్టుబడులు రావాలని మన యూత్ యువకులకు ఉపాధి అవకాశాలు పెరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.