మధ్యతరగతి కుటుంబాలు కడుపు కట్టుకుని, పచ్చడి మెతుకులు తిని, రూపాయి,రూపాయి కూడబెట్టి, బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఇండ్లను కట్టుకుంటారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారి నోట్లో మట్టి కొడుతోంది. స్థానికంగా ఉండే సోదరి స్వప్న తన బిడ్డల పై చదువుల కోసం విదేశాలకు పంపేందుకు ఇల్లు కుదవబెట్టి లోన్ తీసుకుందామంటే… ఇంటిని 22ఏలో ఉందంటూ.. బ్యాంకులు రుణ ప్రక్రియను తిరస్కరించాయని కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. బిడ్డ పెండ్లికో.. ఆపదకో ఉన్న ఇంటిని అమ్ముకునే వీలు లేకుండా.. చేసి, అయోమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడేసింది.
– మాజీ మంత్రి హరీశ్‌రావు

సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : అధికారమిచ్చిన ప్రజలకు సేవ చేయకుండా… లేని సమస్యలు సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్కా రిజిస్ట్రేషన్లు ఉన్న, పేద, మధ్య తరగతి రెక్కల కష్టంతో సంపాదించుకున్న ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ రాబందుల కన్ను పడిందన్నారు. ఇండ్లు, స్థలాలను అకారణంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి జనాలను కాంగ్రెస్ గద్దలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. తక్షణమే 22ఏ నిషేధిత జాబితాను పూర్తిగా రద్దు చేయకపోతే, రాబోయే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని, అవసరమైతే వేలాది మంది బాధితలతో సచివాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బోడుప్పల్ పరిధిలోని తిరుమల మిడోస్, లక్ష్మీగణపతి, హేమా నగర్ కాలనీవాసుల ఇండ్లను ప్రభుత్వం 22ఏ జాబితాలో చేర్చడంపై ఆయా కాలనీల్లోని బాధితులకు బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సమావేశానికి హరీశ్ రావు హాజరయ్యారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మా రెడ్డి, మంద సంజీవరెడ్డి, బోడుప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ బుచ్చిరెడ్డితోపాటు, పెద్ద ఎత్తున బాధితులు పాల్గొన్నారు.

సుభిక్షమైన తెలంగాణను రేవంత్‌రెడ్డి సర్వనాశనం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కన్నీళ్లు తప్ప నీళ్లు లేవని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. బోడుప్పల్ పెద్ద కంచె 360 ఎకరాల దళితుల భూమి అభివృద్ధి చేయకుండా స్టే తెచ్చి అడ్డుకుని పేదల బతుకుల్లో చీకటి నింపారని ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్లా వెలిగిపోయే దశలో ఉన్న బోడుప్పల్‌ను కుట్రతో అడ్డుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, క్రిశాంక్, మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, నాయకులు మీసాల కృష్ణ, చక్రపాణిగౌడ్, సంతోష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1998లో ఓసారి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేశారు. ఎప్పుడో రద్దు చేసిన చట్టాన్ని మళ్లీ జనాలపైకి ఎగదోసి, పక్కా పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్ల దందాకు తెరలేపారని, ఇవన్నీ తుగ్లక్ చర్యలు కాకపోతే మరేమిటనీ హరీశ్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన సొంత ల్యాండ్ బ్యాంక్, ఎస్సీల అసైన్డ్ భూములతో పాటు కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని 1000 గజాల పార్కును కూడా అమ్మకానికి పెట్టిందని హరీశ్‌రావు ఆరోపించారు. గుడి, బడి, దవాఖాన, శ్మశానాలను కూడా వదలకుండా అక్రమాలకు తెగబడ్డారని మండిపడ్డారు. రాత్రికి రాత్రే ఇళ్లను యూఎల్సీ కింద 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడం వెనుక 30 శాతం కమీషన్ కుట్రలు దాగి ఉన్నాయన్నారు.
దళారులు నేరుగా ఇండ్ల యజమానుల వద్దకు వెళ్లి, 30 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తప్పు చేసి నిషేధిత జాబితాలో పెట్టింది ప్రభుత్వం. మీ కమీషన్ల కక్కుర్తి కోసం, ప్రభుత్వం చేసిన తప్పుకు సామాన్యులు ప్రజలు ఆఫీసుల చుట్టు ఎందుకు తిరగాలి? ఎందుకు తమ ఇండ్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అప్లికేషన్లు పెట్టుకోవాలి? అని ప్రశ్నించారు. ‘మంత్రి పొంగులేటి గారూ… తప్పు చేసింది మీరు, కేవలం క్షమాపణలు చెప్పి తప్పించుకోవాలని చూడకండి, ఆప్లికేషన్లతో సంబంధం లేకుండా ఆ భూములను 22ఏ నుంచి తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన’ని స్పష్టం చేశారు.
ఈ ప్రభుత్వ పనితీరు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే… ఏకంగా తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సరూర్ నగర్ ప్రాంతాలను కూడా నిషేధించిన ప్రభుత్వం… చివరకు అమీన్పూర్ పోలీస్ స్టేషన్‌ను కూడా 22ఏ జాబితాలోనే చేర్చిందంటే కాంగ్రెస్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణ రాష్ర్టాన్ని రియల్ ఎస్టే ట్ వ్యాపారుల చేతిలో పెట్టిందన్నారు. ఇటు ముఖ్యమంత్రి, అటు మంత్రి పొంగులేటి ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని, వీళ్లిద్దరూ రాష్ర్టాన్ని అడ్డం పెట్టుకుని, ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం చేస్తున్నారు. అయినా రాహుల్ గాంధీ ఢిల్లీలో చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీకు వ్యాపారు చేయడం మాత్ర మే తెలుసు…. కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పక్షాన పోరాడటం, మీ మెడలు వంచడం మాత్రమే తెలుసనీ హెచ్చరించారు.
ఆన్లైన్లోని భూభారతి రిజిస్ట్రేషన్ పోర్టల్ నుంచి 22ఏ నిషేధిత జాబితాలను ప్రభుత్వం రాత్రికి రాత్రే పూర్తిగా మాయం చేసిందని, హైదరాబాద్ నగర సమాచారాన్నే నిషేధించిందని హరీశ్ రావు ఆరోపించారు. తక్షణమే 22ఏ నిషేధిత జాబితాను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని, వివరాలన్నీ బయటపెట్టాలని బీఆర్ఎస్ పక్షాన ఆయన డిమాండ్ చేశారు.
పేద, మధ్యతరగతి వర్గాలకు భరోసా నిచ్చేలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం ఎంతో మందికి ఊరటనిచ్చింది. ఓవైపు కాంగ్రెస్ పెద్దలు నిషేధిత చట్టాన్ని ఆసరాగా చేసుకుని తమ ఆస్తులకు భరోసా లేకుండా చేసిన సమయంలో ఆపన్నహస్తంతో ముందు కు వచ్చిందన్నారు.ఆస్తులను పరిరక్షించడంలో బీఆర్ఎస్ అండగా ఉండాలని పలువురు బాధితులు ఈ సందర్భంగా వేడుకున్నారు. బాధితులకు హామీ ఇస్తూ బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన జనతా గ్యారేజ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఏ సమస్య వచ్చినా గులాబీ జెండా పట్టుకోవాలని హరీశ్ రావు అన్నారు.