కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు.. గురుకులాల టెండర్లలో రూ. 2 వేల కోట్ల అవినీతి అక్రమాలు జరిగాయని..వాటిని ఆధారాలతో సహా బయటపెడుతామంది బీఆర్ఎస్.. ఇంకేం..అధికార పార్టీ మంత్రులు గజగజ వణికిపోయారు. చేసిన అవినీతిని ఆధారాలతో సహా రుజువు చేస్తే.. ఇక తమ బండారం బయటపడుతుందని భయపడిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకుల నోళ్లు నొక్కేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రెస్‌క్లబ్ వేదికగా చర్చిద్దామంటూ.. బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విసిరిన సవాల్‌ను స్వీకరించినట్లు కలరింగ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు.. సమాధానం చెప్పలేక పరారయ్యారు. ఆ తరువాత తిరిగి గన్ పార్కు వద్దకు చర్చకు రావాలంటూ.. మంత్రులు సవాల్ విసిరారు.. వాళ్లసవాల్ను స్వీకరించి.. చర్చకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ అగ్రనాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
తాము గన్‌పార్కు వద్దకు వచ్చి అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా వివరిస్తామంటూ.. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ నుంచి బయలుదేరడంతో పోలీసులు కదలనివ్వలేదు. వారిని గన్‌పార్కు వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకొని అరెస్ట్ట్ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో హైదరాబాద్‌లో పోలీసులు సృష్టించిన హై‘డ్రామా’.. బీఆర్ఎస్ అగ్రనేతల అక్రమ అరెస్ట్‌లు, మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు.. కలగలిసి గురువారం రోజు రాజధాని నగరం ఒక్కసారిగా రాజకీయ రణరంగంగా మారింది. బీఆర్ఎస్ సవాల్‌కు సై అంటే.. కాంగ్రెస్ నైనై అంటూ.. తోకముడిచింది. బీఆర్ఎస్ సంధించిన ప్రశ్నలకు బదులివ్వలేక..చేతగానితనంతో పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అణచివేత రాజకీయాలకు తెరలేపింది. బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం అబ్బా అంటూ విలవిలలాడింది.

సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ఎండగడుతూ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక అధికార పక్షం పూర్తిగా తోకముడిచింది. బీఆర్ఎస్ సంధించిన ప్రశ్నలకు బదులివ్వలేక, చేతగానితనంతో పోలీసులను అడ్డుపెట్టుకొని అణచివేత రాజకీయాలకు తెరలేపింది. బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం అబ్బా అంటూ విలవిలలాడింది. ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ అగ్రనేతలను, శ్రేణులను అడుగడుగునా పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి పరాకాష్టగా నిలిచింది.
ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలను గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్ట్‌లతో భయభ్రాంతులకు గురిచేసేందుకు తొలుత సర్కారు కుట్ర పన్నింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు పలువురు ముఖ్య నాయకులను, ఎమ్మెల్యేలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎకించి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హకును కూడా కాలరాస్తూ, నియంతృత్వ ధోరణితో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
వెన్నుచూపి పారిపోయిండ్రు
ఏవరి పాలనలో ఎవరేం చేశారో చర్చిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ హయాంలో తెచ్చిన అప్పులపై తేలుద్దామని మంత్రి జూపల్లి.. గురుకుల టెండర్లలో అక్రమాలు జరగలేదని, నిజనిజాలు బట్టబయలు చేస్తామని మంత్రులు అడ్లూరి, పొన్నం, అజారుద్దీన్ సవాళ్లు విసిరారు.. దమ్ముంటే రమ్మన్నారు.. తొడగొట్టారు.. కానీ ఆధారాలతో చర్చకు సిద్ధమైన మమ్మల్ని చూసి తోక ముడిచి పారిపోయారు. పదేండ్లలో నికార్సైన పాలన అందించి తెలంగాణను నిటారుగా నిలబెట్టిన మాతో చర్చించే దమ్మూ ధైర్యం కాంగ్రెస్ పిరికిపందలకెక్కడిది. అయినా ముఖ్యమంత్రి, మంత్రులకు సవాళ్లు విసరడం, వెన్నుచూపి పారిపోవడం మొదటి నుంచి అలవాటే.
-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

కాంగ్రెస్.. సెల్ఫ్‌గోల్
ముగ్గురు మంత్రులు అవినీతిపై సవాళ్లు విసిరి.. చివరకు చర్చకు రాకుండా పోలీసుల వెనుక దాకుని తోక ముడిచారు.. గోల్ కొడతామనుకుని కాంగ్రెస్ నేతలు సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు.
-మాజీ మంత్రి హరీశ్‌రావు
కుట్రలను తిప్పికొట్టిన గులాబీ దండు
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, పోలీసుల తీరుతో ఎంతలా లాఠీలు ఝుళిపించినా.. గులాబీ దళం వెనకడుగు వేయలేదు. గ్రేటర్ నలుమూలల నుంచి తెలంగాణ భవన్‌తో పాటు కంచన్‌బాగ్, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌తో పాటు పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెకి ప్రభుత్వ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అక్రమ అరెస్ట్‌లకు వ్యతిరేకంగా జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించాయి. హరీశ్‌రావు సహా నేతల అరెస్ట్‌లను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. పోలీసుల నిర్బంధాలు తమ పోరాటాన్ని ఆపలేవని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని గులాబీ నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు.
పోలీసుల వైఖరి ఏకపక్షం
– మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రాష్ట్రంలో నడుస్తోంది ప్రజా ప్రభుత్వం కాదు.. ఒక సరస్ కంపెనీ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించిన మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఇతర పార్టీ ముఖ్య నేతలను తలసాని శ్రీనివాస్ పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై, పోలీసుల ఏకపక్ష వైఖరిపై నిప్పులు చెరిగారు. గడిచిన 30 నెలలుగా కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి మిగిలింది శూన్యమని తలసాని విమర్శించారు. కేవలం ఈ కొద్ది కాలంలోనే ప్రభుత్వం ఏకంగా 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని, కానీ తెచ్చిన పైసలతో ప్రజలకు ఒకటంటే ఒక మంచి పని కూడా చేయలేదని మండిపడ్డారు. మంత్రులు సవాల్ విసిరితేనే హరీశ్‌రావు గన్ పార్ వద్దకు బయలుదేరారని తలసాని స్పష్టం చేశారు. మంత్రుల పిలుపు మేరకే ప్రజాస్వామ్యబద్ధంగా బయలుదేరిన హరీశ్‌రావును అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సవాల్ విసిరిన మంత్రులు.. ఇప్పుడు పిరికిపందల్లా పారిపోయారని ఎద్దేవా చేశారు.



