ఖైరతాబాద్, సెప్టెంబర్ 17 : ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతిని గురువారం మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరీశ్ రావు మాట్లాడుతూ ఖైరతాబాద్ గణేశుడంటే కేవలం రాష్ట్రంలోనే కాదు, యవత్తు ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచారన్నారు. చార్మినార్, గోల్కొండనే కాదు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో బడా గణేశ్ విగ్రహం కీలకంగా నిలుస్తున్నదన్నారు.

ఓ వైపు ప్రపంచంలోనే ఎత్తయిన వినాయకుడి విగ్రహం మరో వైపు నాడు బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టించిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్‌లో ప్రత్యేకత సంతరించుకున్నాయన్నారు. 69 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్టించడం గొప్ప విషయమని, పర్యావరాన్ని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుందన్నారు. ఉత్సవాలను ఎంత వైభవంగా నిర్వహిస్తున్నామో.. నిమజ్జన ఘట్టంలోనూ అంతే అప్రమత్తత అవసరమన్నారు.
ఇటీవల పటాన్‌చెరూలో చోటుచేసుకున్న విషాదకర ఘటన తనను కలచివేసిందని, రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం, ఉత్సవ సమితులు సమన్వయంతో నిమజ్జనాన్ని చేపట్టాలని సూచించారు. హరీశ్‌రావు, తలసాని వెంట తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేశ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, గజ్జెల ఆనంద్, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు సింగరి రాజ్ కుమార్, మహేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.