GHMC | బంజారాహిల్స్, మే 3: జీహెచ్ఎంసీ వీధి దీపాల విభాగం సిబ్బంది పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి స్ట్రీట్‌లైట్ స్తంభానికి చేయి తాకడంతో కరెంట్ షాక్‌తో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరిగుట్ట గ్రామానికి చెందిన తుమ్మ భావన రుషి (35) హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ వెంకటగిరిలో నివాసం ఉంటున్నాడు.
రెండేండ్ల క్రితం సుజాత అనే యువతితో ప్రేమ వివాహం కాగా, ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఇటీవల నూతన ఉద్యోగానికి రుషి సెలక్ట్ అయ్యాడు. గురువారం రాత్రి 9గంటల ప్రాంతంలో తన సర్టిఫికెట్లను జిరాక్స్ తీసుకుని వస్తానంటూ ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. జిరాక్స్ తీసుకున్న అనంతరం ఇంటికి వస్తున్న క్రమంలో కృష్ణానగర్ ప్రధాన రహదారి ఫుట్‌పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న రుషి చేయి స్ట్రీట్‌లైట్ పోల్‌కు తగిలింది.
ఆ స్తంభానికి కరెంట్ వస్తుండటంతో షాక్‌కు గురై రుషి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 304(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కొత్త ఉద్యోగం వచ్చిందంటూ ఆనందంతో ఇంట్లోంచి వెళ్లిన భర్త నిమిషాల వ్యవధిలోనే మృత్యువు ఒడిలోకి చేరుకోవడంతో భార్య సుజాతను తీవ్రంగా కలచివేసింది.