సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలనలో విద్యుత్ వినియోగదారులకు కష్టాలు పెరిగాయి. టీజీఎస్పీడీసీఎల్లో కొందరు అధికారుల అనాలోచిత నిర్ణయాలు వినియోగదారుల పాలిట శాపంగా మారాయి. గతంలో ఒక భవన నిర్మాణం చేస్తున్న సమయంలో నిర్మాణ సమయంలో తాత్కాలిక పద్ధతిలో విద్యుత్ కనెక్షన్ తీసుకునేవారు. పని పూర్తయిన తర్వాత తనకున్న విద్యుత్ కనెక్షన్ కేటగిరీ మార్చడానికి ఒక్క దరఖాస్తు పెట్టుకుంటే వినియోగదారుడికి రెండు మూడురోజుల్లో కేటగిరి సహజంగా మారేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నామని ఎస్పీడీసీఎల్ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులే లేవు. ప్రస్తుతం కేటగిరి 8 (టెంపరరీ) నుంచి కేటగిరీ 2 (డొమెస్టిక్)కు మార్చుకోవడానికి వినియోగదారుడు కార్పొరేట్ కార్యాలయం చుట్టూ రెండు మూడునెలలు ప్రదక్షిణలు చేయడంతో పాటు కొందరు క్షేత్రస్థాయి సిబ్బందిని మేనేజ్ చేస్తే తప్ప కేటగిరీ మారే పరిస్థితులు లేవని వినియోగదారులు అంటున్నారు.
గతంలో భవన నిర్మా ణం పూర్తి కాగానే తమకు సంబంధించిన ఓసీని ఆన్లైన్లో అప్లోడ్ చేసి దరఖాస్తు చేస్తే ఒక్క మెయిల్‌తో కేటగిరి మార్చేవా రు. కానీ ప్రస్తుతం కొత్త నిబంధనల వల్ల క్యాటగిరీ మార్చాలంటే ఏఈ నుంచి కార్పొరేట్ కార్యాయం వరకు కాళ్లరిగేలా తిరుగుతున్నామని, ఒకవేళ తాము సొం తంగా వెళ్లకుండా వేరే ఎవరైనా సిబ్బందిని అడిగితే వారికి కొంత సమర్పించుకోవలసిందేనని వినియోగదారులు అంటున్నా రు. కేటగిరి మార్చడానికి పాతవిధానాల ను అమలు చేయాలని వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ దక్షి ణ డిస్కంలో కొందరు కీలక బాధ్యతల్లో ఉన్న ప్రభుత్వ నియమిత అధికారులు మాత్రం ఈ విషయంలో పెద్దగా స్పందించవద్దని సీఎండీకి చెబుతున్నట్లు మింట్‌కాంపౌండ్‌లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా టీజీఎస్పీడీసీఎల్లో ఆ కీలకవ్యక్తులు తీసుకుంటున్న నిర్ణయాలతో ఏ ఒ క్కరూ సంతృప్తిగా లేకపోగా..చాలా విషయాల్లో డిస్కం ప్రతిష్ట దిగజారుతున్నద న్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత నెల లో బదిలీలు, ఆ తర్వాత డిప్యుటేషన్ ఆర్డర్లు, చాంబర్ల కేటాయింపు, ఓసీల వ్యవహారం ఇలా పలు అంశాలు ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు.. ఒక్కరేమిటి అన్ని కేటగిరీలలో డిస్కం ఉన్నతాధికారులపై వ్యతిరేకత వచ్చేలా చేశాయి.
సాధారణంగా 15 మీటర్ల కంటే ఎత్తు ఉన్న భవనాలకు అంటూ మూడు ఫ్లోర్ల కంటే ఎక్కువగా ఉన్న నిర్మాణాలకు కట్టే సమయంలో విద్యుత్ కనెక్షన్‌ను కేటగిరి 8లో తాత్కాలికంగా ఇస్తారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత కేటగిరి 8లో ఉన్న వాటిని మార్చాలంటూ విద్యుత్ అధికారులకు వినియోగదారులు గతంలో ఆన్లైన్లోనే కేటగిరి మార్పు కోసం ఒక అప్లికేషన్ పెట్టుకునేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తేనే కేటగిరి మారుస్తారు. అయితే కనెక్షన్లు డొమెస్టిక్ కాకుం డా టెంపరరీగా ఉంటే వినియోగదారులకు నెలవారీ కరెంట్ బిల్లు మోతమోగుతుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత రెండుమూడునెలలు కేటగిరి మారకపోవడంతో వేలాది రూపాయలు బిల్లులుగా చెల్లించాల్సి వస్తున్నదని పలువురు వినియోగదారులు అంటున్నారు. సాధారణంగా డొమెస్టిక్‌లో వినియోగించిన యూ నిట్లను బట్టి ఒక యూనిట్‌కు ఐదు నుంచి ఏడురూపాయల వరకు వసూలు చేస్తుండగా టెంపరరీ కేటగిరీలో యూనిట్‌కు రూ.12 వసూలు చేస్తున్నారు. దీంతో వినియోగదారులకు బిల్లు సాధారణంగా వచ్చేదానికంటే రెండు నుంచి మూడింతలు ఎక్కువగా వస్తుంది. కేటగిరి మార్పు కేవలం వారం నుంచి పదిరోజుల్లోపు అయిపోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దరఖాస్తులన్నీ పరిశీలనకోసం డిస్కంలో పెద్ద ఎత్తున పెండింగ్‌లోనే ఉన్నాయని ఒక సీనియర్ విద్యుత్ అధికారి తెలిపారు.
ప్రస్తుతం టీజీఎస్పీడీసీఎల్ పెట్టిన నిబంధనల ప్రకారం ఒక భవనం కేటగిరీ మార్చడానికి అవసరమైన డాక్యుమెంట్స్‌తో పాటు తమ అప్లికేషన్‌ను స్థానిక ఏఈకి ఇవ్వాలి. అక్కడినుంచి ఏడీఈ, డీఈ, ఎస్ఈ, సీఈ..ఇలా కార్పొరేట్ ఆఫీసువరకు వెళ్లి మళ్లీ అది తిరిగి రావడానికి దాదాపు 2,3నెలలు పడుతుంది. అంతకంటే ఎక్కువ సమయం కూడా తీసుకుంటున్నదని కొందరు వినియోగదారులు ఎస్పీడీసీఎల్ సోషల్‌మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలో ఒక్క మెయిల్‌తో డాక్యుమెంట్లను పరిశీలించి ఆ తర్వాత కేటగిరీ 2కు మార్చేవారు. కానీ ఇప్పుడలా కాకుండా ఓసీ సరైనదా కాదా అని పరిశీలించడానికి ఆన్లైన్ తీసేసి ఆఫ్‌లైన్‌లో వినియోగదారుడి నుంచి దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలు తీసుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని కార్పొరేట్ ఆఫీసుకు చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే దశలవారీగా పరిశీలించడంలో చాలా ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమేనని, జీహెచ్ఎంసీ నుంచి ఒక్క లింక్ ఇస్తే ఈ సమస్య వెంటనే పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల తమ కనెక్షన్లతో జీహెచ్ఎంసీకి కొంత ఆదాయం పెరిగినందున వారు ఓసీ నిజమైనదేనా కాదా అని తేల్చడానికి లింక్ ఇస్తే అందులో ఓసీ నంబర్ నమోదు చేస్తే ఆ సర్టిఫికెట్ నిజమైనదా కాదా తెలుస్తున్నదని ఆ అధికారి తెలిపారు. జీహెచ్ఎంసీ, టీజీఎస్పీడీసీఎల్ రెండూ సమన్వయంతో ఈ పరిస్థితిని అధిగమించి కేటగిరి మార్పు వెంటవెంటనే చేస్తే తమపై భారం పడకుండా ఉంటుందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.