హైదరాబాద్: రైలులో ఓ మైనర్ బాలికను ఓ దుండగుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. అర్ధరాత్రి సమయంలో రైలులో బాత్రూమ్కు వెళ్లిన బాలికను ఫోన్లో వీడియోలు తీసి అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. రక్సెల్-సికింద్రాబాద్ (Secunderabad) ఎక్స్‌ప్రెస్‌లో ఒడిశాకు చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్నది. వారిలో 16 ఏండ్ల బాలిక కూడా ఉన్నది. కేల్జార్ స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి 2 గంటలకు ఆమె వాష్ రూమ్‌కు వెళ్లింది.
బాలిక ఒంటరిగా వెళ్లడం గమనించిన దుండగుడు.. బాత్రూమ్ వద్ద తన ఫోన్లో వీడియోలు తీశాడు. అవి చూపించి ఆమెను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతడి నుంచి తప్పించుకుని.. కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.