దుండిగల్, జూలై 10: గ్రామంలో తనకు ఉన్న వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు లేఖ రాసిన ఓ వ్యక్తి ఇంట్లో నుంచి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బౌరంపేట గ్రామానికి చెందిన మాధవరెడ్డి కుటుంబానికి దొమ్మర పోచంపల్లి గ్రామంలోని సర్వేనంబర్ 188లో తన పూర్వీకుల నుంచి సంక్రమించిన 1.13 ఎకరాల భూమి ఉంది.
దాని చుట్టపక్కల ఉన్న భూములను గత 20 ఏండ్ల క్రితమే నిజాంపేటకు చెందిన కార్పొరేటర్ మేకల వెంకటేశం కొనుగోలు చేశాడు. ఇటీవల త్రిపుర ల్యాండ్‌మార్క్ నిర్మాణ సంస్థకు డెవలప్మెంట్కు ఇచ్చారు. మధ్యలో ఉన్న మాధవరెడ్డి భూమిని తక్కువ ధరకు కొట్టేసేందుకు త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ ఎండీ, పసుపులేటి సుధాకర్ ప్రయత్నించడంతో మాధవరెడ్డి ససేమిరా అన్నాడు. దీంతో మధవరెడ్డిపైకి గ్రామస్తులను ఉసిగొలిపారు. వారు గొడవ చేశారు.
తీవ్ర మనస్తాపానికి గురైన మాధవరెడ్డి దుండిగల్ సీఐకు లెటర్ రాసి సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం ఆయన గదిలో లెటర్ లభించింది. మాధవరెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును రెండు రోజుల పాటు వెలుగులోకి రాకుండా యత్నించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాధవరెడ్డి తన సెల్‌ఫోన్‌ను సైతం ఇంట్లోనే వదిలివెళ్లడంతో అతడు ఎక్కడ ఉన్నాడనేది కనుక్కోవడం ఇబ్బంది కరంగా మారింది.
లేఖలో సంచలన విషయాలు..
త్రిపుర ల్యాండ్‌మార్క్ ఎండీ పసుపులేటి సుధాకర్, కార్పొరేటర్ వేధింపులు తాళలేక దుండిగల్ సీఐ శంకరయ్యకు మాధవరెడ్డి రాసిన లేఖలోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఈ భూ వివాదంతో మానసికంగా పూర్తిగా విసిగిపోయానని, పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ తనకు న్యాయం జరగలేదంటూ పేర్కొన్నాడు. సోమవారం తనను పిలిపించుకున్న కార్పొరేటర్, పసుపులేటి సుధాకర్, కొందరు గ్రామస్తులు కలిసి మానసికంగా వేధించినట్టు వివరించాడు.
కొందరైతే బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తాను ఇంటిని విడిచి వెళ్లిపోతున్నానంటూ లేఖలో రాశాడు. తన కుటుంబాన్ని కాపాడాలని పోలీసులను కోరారు. అమ్మా,నాన్న, భార్యా పిల్లలు తనను క్షమించాలని వేడుకున్నాడు. తనను ఇబ్బంది పెట్టిన నిజాంపేట కార్పొరేటర్ మేకల వెంకటేశం, త్రిపుర ల్యాండ్ మార్క్ యజమాని పసుపులేటి సుధాకర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ.. లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
ఇరువర్గాలపై కేసు నమోదు..
భూ వివాదంలో రెండు నెలల కిందటే ఇరువర్గాలపై దుండిగల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో15 రోజుల పాటు మాధవరెడ్డి జైలు శిక్ష అనుభవించి, కండీషన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇదే కేసులో పోలీసుల నుంచి తప్పించుకున్న పసుపులేటి సుధాకర్‌రెడ్డి, తదితరులకు మాత్రం ముందస్తు బెయిల్ లభించింది.
పోలీసులు సంపన్నులకే వత్తాసు పలుకుతున్నారని, ల్యాండ్‌మార్క్ యజమానిని అరెస్ట్ చేయకుండా.. అతడికి ముందస్తు బెయిల్ వచ్చేందుకు సహకరించారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. మాధవరెడ్డికి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ల్యాండ్‌మార్క్ యజమాని పసుపులేటి సుధాకర్, నిజాంపేట కార్పొరేటర్ మేకల వెంకటేశం బాధ్యత వహించాలని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
ఆగిన తండ్రి ఊపిరి…
రియల్టర్ల వేధింపులతో ఇంట్లో నుంచి కొడుకు వెళ్లిపోవడంతో మాధవరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి (70) తీవ్రమానసిక వేదనకు గురయ్యాడు. రెండు రోజులుగా కొడుకు ఆచూకీ లభించకపోవడంతో కృష్ణారెడ్డి బుధవారం ఉదయం గుండెనొప్పితో మరణించినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అతడి అంత్యక్రియలను గురువారానికి వాయిదా వేశారు. అప్పటివరకైనా మాధవరెడ్డి వస్తాడనే ఆశ అందరిలో నెలకొందని గ్రామస్తులు పేర్కొన్నారు.