హైదరాబాద్ విశ్వనగరంలా అభివృద్ధి చెందుతున్నది. నగరం నలువైపులా విస్తరిస్తున్నది. ఎటూ చూసినా బహుళ అంతస్తులే వెలుస్తున్నాయి. ఆకాశమే హద్దుగా యేడాదికి ఏడాది అంతస్తులు పెరుగుతున్నాయి. వాటి భద్రతకు భరోసా ఎక్కడుంది..? అగ్నిప్రమాదాలు సంభవిస్తే.. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే అగ్నిమాపక వ్యవస్థ్ద ఉందా? అంటే లేదనే సమాధానం వస్తోంది. అగ్నిప్రమాదాన్ని నియంత్రించే పరికరాలు అందుబాటులో ఉన్నాయా అంటే.. అవేమీ లేవంటున్నారు. ఇటీవల హాంకాంగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదాలు వస్తే ప్రాణాలకు భద్రత ఏదని బహుళ అంతస్తుల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) :
సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రమాదం అనుకోకుండా వచ్చేది… అలాంటి ప్రమాదాలను ఎదుర్కొవడానికి కావాల్సిన పరికాలు, యంత్రాలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉండాలి.. కాని మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచనే చేయడం లేదు.. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రధాన నగరాల్లో తరుచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల హాంకాంగ్‌లో 30 బహుళ అంతస్తుల సముదాయంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. అలాంటి ఘటనల నుంచి కండ్లు తెరవాల్సిన అవసరముంది. హైదరాబాద్‌లో 18 అంతస్తుల భవనాల్లో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగిందంటే నివారించేందుకు కావాల్సిన యంత్రాలు మన అగ్నిమాపక శాఖ దగ్గర లేవు.
అంటే 18 అంతస్తులపైన ప్రమాదం జరిగిందంటే ప్రభుత్వం చేతెలెత్తేసే పరిస్థితి. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంలా అభివృద్ధి చెందుతూ నలువైపులా విస్తరిస్తున్నది. ఎటూ చూసినా బహుళ అంతస్తులే వెలుస్తున్నాయి. 63 అంతస్తుల వరకు అపార్ట్మెంట్ నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు ఇవ్వడంతో ఆకాశమే హద్దుగా యేడాదికి ఏడాది అంతస్తులు పెరుగుతున్నాయి. ఇలా బహుళ అంతస్తుల భవనాలు పెరుగుతున్నా, వాటి భద్రతకు భరోసా ఎక్కడుంది.. ఉహించని అగ్నిప్రమాదాలు సంభవిస్తే, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనే వ్యవస్థ అగ్నిమాపక శాఖ వద్ద ఉందా? అంటే లేదనే సమాధానం వస్తోంది.
18 అంతస్తులకుపైన ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే అక్కడ మంటలను ఎలా అర్పేస్తారు, అక్కడ చిక్కుకున్న వారిని ఎలా రక్షిస్తారు, అగ్నిప్రమాదాన్ని నియంత్రించే పరికరాలు అందుబాటులో ఉన్నాయా? అంటే.. అవేమి లేవనే సమాధానాలు వస్తుండడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన అగ్నిమాపక శాఖలో ప్రమాదాలను నివారించేందుకు కావాల్సిన అత్యాధునిక పరికరాలను సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ర్టాలు, దేశాలు ఏ విధంగా పరికరాలను సమకూర్చుకుంటున్నాయో పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.
బోంటో స్కై లిఫ్ట్‌లు రెండు అగ్నిమాపక శాఖ వద్ద ఉండగా, ఇవి 54 మీటర్ల ఎత్తు వరకు (18 ఫ్లోర్ల వరకు), ఒక ఇంపోర్టెడ్ రిస్క్యూ టెండర్ , రిస్క్యూ రెండర్స్ 4, ఒక హజ్మత్ వాహనం, ఒక డీసీపీ టెండర్స్, ఒక స్నోర్కెల్, మల్టీపర్సస్ టెండర్లు 68, అడ్వాన్స్ వాటర్ టెండర్లు 9, వాటర్ కమ్ ఫోమ్ టెండర్లు 9,160 వాటర్ టెండర్లు, 18 మినీ వాటర్ టెండర్లు, 21 వాటర్ బ్రౌజర్లు, ఐదు వాటర్ లారీలు, 29 మిస్ట్ జీప్ ఇలా ప్రమాదాలను నిలువరించేందుకు ఉపయోగించే వాహనాలు అగ్నిమాపక శాఖ వద్ద 827 ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక శాఖలో 714 ఖాళీలున్నాయి.
అగ్నిప్రమాదాలను నిలువరించేందుకు కావాల్సిన పరికరాలను సమకూర్చుకోవడంలో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు మన తెలంగాణ కంటే చాలా ముందున్నాయి. అక్కడ అగ్నిప్రమాద నిబంధనలకు సంబంధించిన చట్టాల అమలు కూడా పకడ్బందీగా అమలు చేస్తూ, ఎప్పకటిప్పుడు ప్రమాదాల నియంత్రణపై అప్రమత్తంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో 110 మీటర్లపై అగ్నిప్రమాదాలను నిలువరించేందుకు కావాల్సిన స్కై లిప్ట్‌లు, ఫైర్ ఫైటింగ్ పరికరాలు ఉండగా, ముంబాయిలో 50 అంతస్తుల వరకు చేరుకునే ఫైర్ ఫైటింగ్ వ్యవస్థలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అదే విదేశాలలో మరింత మెరుగ్గా, అధునిక వ్యవస్థను అమలు చేస్తున్నారు. సింగపూర్, దుబాయ్, అమెరికా, అస్ట్రేలియా, జర్మనీ, జపాన్, కెనడా, లండన్ దేశాలలో అధునాతన పరికాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ తరుచూ తనిఖీలు చేయడం, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ ఆయా భవనాల్లో ఎలా ఉందనే విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, నిర్వాహకులు కూడా అప్రమత్తంగా ఉండేలా చేయడంలో అక్కడి వ్యవస్థలు పకడ్బందీగా పనిచేస్తాయి.
భారీ అగ్నిప్రమాదాలు సంభవించగానే ఇక్కడ అగ్నిమాపక శాఖ హడావుడి చేస్తుంటుంది. అన్ని భవనాల్లో ప్రమాద నివారణ నిబంధనలు, పరికాలు పరిశీలిస్తామని చెబుతూ రెండు మూడు రోజులు హడావుడి చేసి, సమస్య సర్దుమణగగానే ఆ విషయాన్ని వదిలేస్తుండడం గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. గతంలో అగ్నిప్రమాదాలు ఎందుకు జరిగాయి, అవి జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాత్రం దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం అగ్నిమాపక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడం కూడా దీనికి కారణం. అగ్నిప్రమాదంపై ఒక్కో విభాగం ఒక్కో విశ్లేషణ ఇస్తోంది. ఎక్కువగా షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదాలు సంభవించాయంటూ ప్రమాద సమయంలో చర్చ జరిగినా చివరకు అది తమకు సంబంధం లేదంటూ ఆ శాఖ చెబుతూ చివరకు ఆ ప్రమాదానికి అసలు కారణం ఎవరో తేల్చని పరిస్థితి. ఆయా విభాగాలు, పోలీసులకు వచ్చే ఫోరెన్సిక్ నివేదికలకు పొంతన ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి.
భవనం భద్రత బాధ్యత నిర్మాణదారుడిపై ఎక్కువగా ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాల్లో ఫైర్ అలారమ్, స్మోక్ డిటెక్టర్లు, వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసినా అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాలు ఎప్పకటిప్పుడు పరిశీలిస్తుండగా.. హైరేంజ్ భవనాలు నిర్మించే వారు ఆయా భవనాల నిర్మాణాలను బట్టి కనీసం నాలుగు ఫోర్లకు ఒక రెస్క్యూ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలి, ప్రత్యేకంగా ఫైర్ లిఫ్ట్ ఏర్పాటు చేయాలి. అది ప్రమాద సమయంలో ఫైర్ సిబ్బంది ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తూ, దానికి ప్రత్యేకంగా పవర్ సైప్లె ఉండేలా చూసుకోవాలి.
‘అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా రిస్క్యూ చేయాలి’ అనే విషయంపై నిర్మాణ సమయంలో ఖచ్చితమైన ఫ్లాన్ ఉండాలి. కార్యాలయాలు, దవాఖానాల్లో అగ్నిపమాదాల సమయంలో వెంటనే స్పందించేలా ప్రత్యేక ఫైర్ సేఫ్ట్టీ సిబ్బందిని నియమించుకోవాలి. అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ ఫైటర్లు వచ్చే వరకు ప్రాథమికంగా ఎలాంటి నష్టం జరగకుండా రిస్క్యూ చేసేందుకు ఈ సిబ్బంది ఉపయోగపడుతుంది. బహుళ అంతస్తుల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థను ఎప్పటికప్పుడు అగ్నిమాపక శాఖ తనిఖీలు చేస్తూ ఆయా అసోసియేషన్లను అప్రమత్తంగా ఉంచాల్సిన అవసరముంటుంది.
హైదరాబాద్‌లో నివాసాలకు ఐదంతస్తులకు పైగా(జీ+5) నిర్మించే అపార్ట్మెంట్లకు, వాణిజ్య భవనాలకైతే నాలుగంతస్తులకుపై (జీ+4)లకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందులో 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న భవనాలకు జీహెచ్ఎంసీ (హైడ్రా) నుంచి అనుమతి పొందాల్సి ఉండగా, అంతకంటే ఎత్తులో నిర్మించే భవనాలకు అగ్నిపమాక శాఖ ప్రధాన కార్యాలయం నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. భవన నిర్మాణం పూర్తయిన తరువాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నుంచి అక్యూపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలంటే తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ కావాలి.
నిర్మాణదారుడు అగ్నిమాపక శాఖ ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకుంటే, సబ్బంది వచ్చి భవనాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేశారో లేదో? పరిశీలించిన తరువాతే దానికి ఎన్వోసీ జారీ చేస్తారు. కానీ ఈ ఎన్వోసీలు ఇవ్వడానికి కూడా అగ్నిమాపక శాఖకు నిర్మాణదారులు ఎంతోకొంత ఇచ్చుకోవాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి. చేయి తడపనిదే ఏ పని కాదనే విమర్శలు ఉన్నాయి. అగ్నిమాపక శాఖ వద్ద సరిపడా సిబ్బంది కూడా లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో పైపైన తనిఖీలు నిర్వహించి, చేతులు తడుపగానే ఎన్వోసీలు జారీ అవుతాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం అగ్నిమాపక శాఖలో ఉండే ఖాళీలను భర్తీ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.