వేసవి తాపంతో సతమతమవుతున్న నగరవాసులను వరుణుడు పలకరించాడు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వడగళ్ల వాన పడింది. మలక్పేట,చాదర్ఘాట్, బేగంబజార్ తదితర చోట్ల వర్షం కురిసింది. వివిధ పనుల కోసం బయటకు వచ్చిన పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి.. పరిస్థితిని చక్కదిద్దారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): నగరంలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని.. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు నగరంలోని బేగంబజార్లో 1.8 సెంటీమీటర్లు, ఝాన్సీ బజార్లో 1.6 సెంటీమీటర్లు, జూ పార్క్లో 1.1 సెంటీమీటర్లు, విజయనగర్ కాలనీలో 1.0 సెంటీమీటర్లు, జియాగూడలో 9.3 మిల్లీమీటర్లు, మౌలాలిలో 8.0 మి.మీలు, ఎల్బీ స్టేడియం ప్రాంతంలో 7.8 మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.