సిటీబ్యూరో, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ): ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతూనే, జనాల్ని పీడించుకొని తినే రాబందులు ఇంకా నేటి సమాజంలో కొనసాగుతున్నారు. కొందరి అనాగరిక పోకడల వల్ల చిన్న, చిరు వ్యాపారులు జీవనం సాగించలేకపోతున్నారు. శనివారం వచ్చిందంటే బస్తీలో అలజడి.. సాయంత్రం కాగానే రోడ్డుకు రెండువైపులా కూరగాయల షాపులు, పండ్ల దుకాణాలతో సహా చిరు వ్యాపారుల వద్దకు వచ్చి దర్జాగా హఫ్తా వసూల్ (వారాంతపు మూమూళ్లు) చేస్తుంటారు. ఇదేంటి? అని ప్రశ్నిస్తే.. అందరి ముందు దాడులకు తెగబడుతుంటారు.
డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అని ప్రశ్నించిన చిరు వ్యాపారులను క్షణాల్లో అక్కడి నుంచి తరిమివేస్తుంటారు. ఇదంతా ఎక్కడో పాతబస్తీలో రౌడీల దౌర్జన్యాలు అనుకుంటున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..! నగరం నడిబొడ్డున జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఎన్బీటీ నగర్లో ప్రతి శనివారం కొనసాగుతున్న మామూళ్ల వసూళ్ల పర్వంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామంతా మేయర్ మనుషులమని, మహిళలకు రక్షణగా నిలుస్తూ డబ్బులు వసూలు చేసుకుంటామని వారంతా బాహాటంగానే చెప్పుకుంటారంటే.. పరిస్థితి ఏవిధంగా ఉందో… అర్థం చేసుకోవచ్చు. ఈ వసూళ్ల దందా ఇటీవల పోలీస్ స్టేషన్ దాకా చేరడం గమనార్హం.
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎన్బీటీ నగర్ బస్తీలో స్థానిక ప్రభుత్వ పాఠశాల ముందు ఖాళీ స్థలంలో కొన్నేండ్లుగా వారాంతపు సంత నిర్వహిస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు వచ్చి కూరగాయాలు, పండ్లు, ఆకు కూరలు, ఇతర వస్తువులు విక్రయిస్తుంటారు. సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల దాకా నడుస్తున్న ఈ సంతలో చిరు వ్యాపారుల వద్ద నుంచి మేయర్ మనుషులుగా చెలామణి అయ్యే కొంత మంది మహిళలు ముఠాగా ఏర్పడి డబ్బులు వసూలు చేసుకుంటారు. ఒక్కో దుకాణానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి శనివారం అక్కడకు వచ్చి డబ్బులు వసూలు చేసుకుంటారు.
ఒక్కో చిరు వ్యాపారి నుంచి రూ.60 నుంచి రూ.80 చొప్పున డబ్బులను దర్జాగా వసూలు చేసుకుంటున్న మహిళల దౌర్జన్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఇదంతా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కనుసన్నల్లోనే జరుగుతోందని, ఆమె అనుచరులుగా చెలామణి అవుతున్న మహిళలు ప్రతి శనివారం సుమారు రూ.15 వేల నుంచి 18 వేల దాకా హఫ్తా వసూల్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు, ఇదేంటని ప్రశ్నిస్తే మహిళలు కూరగాయాల మార్కెట్కు వస్తే గతంలో రక్షణ ఉండేది కాదని, ఆకతాయిలు వారిని వేధిస్తుండేవారని, తాము మహిళా సంఘాల తరపున రక్షణ కోసం వచ్చి నిలుస్తుండటంతో మహిళలకు వేధింపులు తగ్గిపోయాయంటూ దబాయిస్తున్నారు.
కాగా, ఈ మొత్తం వ్యవహారంలో 10 నుంచి 12 మంది మహిళలు జట్టుగా ఏర్పడి ప్రతి శనివారం వచ్చే డబ్బులను పంచుకుంటారని, ఎవరైనా ఎదిరిస్తే దాడులు కూడా చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై గతంలోనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లినా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు ఏకంగా మేయర్ అండదండలు ఉండటంతో వీరంతా ‘శనివారం మాది’ అనుకుంటూ వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మేయర్ చూసీ చూడనట్లు వ్యవహరించడం, తమ బతుకులను ఛిద్రం చేస్తున్న వసూళ్ల పర్వాన్ని ఆపేయాలని, తమకూ ఖర్చులు, వ్యవహారాలు, పిల్లలు, కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దని చిరు వ్యాపారులు వేడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న పోలీసులైనా రంగప్రవేశం చేసి మామూళ్ల వసూళ్లకు అడ్డుకట్ట వేస్తారని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.