మన్సురాబాద్, మార్చి 2: భారతీయ భూ వైజ్ఞానిక సర్వే సంస్థ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-GSI) ప్రారంభించి 175 సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జీఎస్ఐ, జీఎస్ఐటీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సంజీవయ్య చిల్డ్రన్ పార్క్ వద్ద వాక్‌థాన్‌ను ఘనంగా నిర్వహించారు. దేశాభివృద్ధికి 175 సంవత్సరాల నుంచి జీఎస్ఐ చేస్తున్న సేవలు.. వాకింగ్ వలన కలిగే శారీరిక, మానసిక లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దక్షిణ భారత దేశంలో గత 175 సంవత్సరాలుగా జీఎస్ఐ కార్యాలయం నిర్వహించిన రూపొందించిన సావనీర్ ను జీఎస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్డీ పట్బాజే ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శిలలు, శిలాజ ఇంధనాలు, శిలాజాల నమూనాలను స్టాళ్లలో ప్రదర్శించారు. జీఎస్ఐ సంస్థ 175 సంవత్సరాల నుంచి దేశానికి చేసిన అద్భుతమైన సేవకు ప్రతీకగా 175 త్రివర్ణ బెలూన్లను గాలిలోకి ఎగరవేశారు. వాక్తాన్ కార్యక్రమాన్ని సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్ నుంచి ప్రారంభమై నెక్లెస్ రోడ్డు మీదుగా స్ఫూర్తి స్థల్‌కు చేరుకొని అటు నుంచి తిరిగి సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో జీఎస్ఐ ఉన్నతాధికారులు, సిబ్బంది, వివిధ సంస్థల విద్యార్థులు, విద్యావేత్తలు, జియో సైంటిస్టులు పాల్గొన్నారు.