సిటీబ్యూరో, జూన్ 9 ( నమస్తే తెలంగాణ )/మేడ్చల్ : గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం సజావుగా జరిగింది. అభ్యర్థులు నిర్ణీత సమయాల్లో కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాశారు. అక్కడక్కడ కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాలకు పరుగులు తీయడం కనిపించింది. కాగా, 10 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. అప్పటికే సిబ్బంది గేట్లు మూసేశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది.
మొత్తంగా హైదరాబాద్‌లో 77 పరీక్షా కేంద్రాల్లో 40,569 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 25,051 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 15,518 మంది అభ్యర్థులు గైర్హాజరు అయినట్టు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మేడ్చల్ జిల్లాలో గ్రూప్ -1 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 69,727 మందిలో 48,962 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. కలెక్టర్ గౌతమ్ కూకట్‌పల్లిలోని ఎంఎన్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ప్రతిభ డిగ్రీ కళాశాల, బాలానగర్‌లోని మార్టిన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించారు.

మరోవైపు గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం 300 ప్రత్యేక బస్సులు నడిపినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు చాలా మంది అభ్యర్థులు బస్సు సేవలను ఉపయోగించుకున్నారని చెప్పారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, చేవెళ్ల, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, కీసర, మొయినాబాద్, గండిమైసమ్మ తదితర ప్రాంతాలకు బస్సులు నిర్ణీత సమయాల్లో అందుబాటులో ఉంచామన్నారు.
అభ్యర్థిని..సమయానికి
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు జీడిమెట్లకు చెందిన నిషిత ఆదివారం అబిడ్స్ బస్టాప్‌లో దిగారు. అయితే ఆమెకు సుల్తాన్‌బజార్‌లోని ప్రగతి మహా విద్యాలయంలో సెంటర్ పడింది. అప్పటికే సమయం మించిపోతుండటంతో కంగారుపడుతుండగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న కాచిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు గమనించి.. వివరాలు తెలుసుకున్నారు. తన కారులో ఆమెను సమయానికి పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిషిత మేనేజర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
-కాచిగూడ, జూన్ 9