సిటీబ్యూరో, ఆగస్టు 21 ( నమస్తే తెలంగాణ ) : నగర శివార్లకు వెళ్లాలంటే బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన మార్గాల నుంచి శివార్లకు బస్సులు ఉండటం లేదంటూ నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు బస్సులు మారితే తప్ప శివార్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
రాత్రి 9 దాటిందంటే ప్రధాన మార్గాల్లో నడిచే బస్సులు కూడా కనిపించడం లేదంటూ చెబుతున్నారు. కొన్ని చోట్ల పరుగెత్తుతూ బస్సులు ఎక్కాల్సిన దుస్థితి ఉందంటూ ప్రయాణికులు చెప్పారు. కార్యాలయాలకు వెళ్లాలన్నా.. ఇంటికి చేరుకోవాలన్నా సాహసోపేతమైన పరుగు తప్పడం లేదంటున్నారు. శివార్ల నుంచి నగరంలో పలు ప్రధాన మార్గాలకు బస్సులు నడపాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఆదిబట్ల, దుండిగల్, మోకీల, శంకర్పల్లి, కొల్లూర్ నియోపాలిస్ సమీపంలోని ప్రాంతాలకు బస్సులు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. గండిమైసమ్మ నుంచి ప్రగతినగర్ మీదుగా బస్సు నడపాలని ఇప్పటికే ఆర్టీసీకి విజ్ఞప్తి పత్రాలు అందించారు. గండి మైసమ్మ మార్గంలో రాంపల్లి, దమ్మాయిగూడ, బాలాజీనగర్‌కు బస్సులు నడపాలని ఉద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు. అయితే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. ఆర్టీసీ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఇప్పటికే ఉంది. కోటి జనాభా దాటిన మాహానగరంలో సుమారు 6వేల బస్సులు ఉండాలని నిపుణులు సూచించారు. కానీ ఇప్పుడు కేవలం 2700 బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో నగరం శరవేగంగా విస్తరిస్తుండటంతో కాలనీలు విరివిగా ఏర్పడుతున్నాయి. వారి రాకపోకలకు ఆర్టీసీ బస్సులు సమకూర్చాల్సిన అవసరం అధికారులపై ఉందని ప్రజా సంఘాలు చెబుతున్నాయి.