Hyderabad Traffic | నగరంలో ప్రయాణమంటే నరకంగా మారింది. కిలోమీటర్ ప్రయాణానికి అరగంట సమయం పడుతున్న సందర్భాలు కోకొల్లాలు. వర్షం పడినా, రహదారులపై వాహనాలు మరమ్మతులకు గురైనా పరిస్థితి చెప్పనవసరం లేదు. సిటీలో వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని సీపీ సజ్జనార్ ఓ సమావేశంలో ప్రకటించారు.
సిటీబ్యూరో, జనవరి 2(నమస్తే తెలంగాణ): ట్రాఫికర్‌ను తొలగించడానికి సజ్జనార్ అన్ని విభాగాలతో సమన్వయ సమావేశం నిర్వహించి ట్రాఫిక్ నియంత్రణపై చర్చించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, పాతబస్తీ తదితర ప్రాంతాలన్నీ ట్రాఫిక్ రద్దీతో స్థానికులతో పాటు ఆప్రాంతాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్ రద్దీ నియంత్రించడానికి పోలీసుశాఖ జీహెచ్ఎంసీకి కొన్ని ప్రతిపాదనలు పంపింది.
పోలీసులు పంపిన అనేక ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదనే విషయం ఈ సమావేశంలో వెలుగులోకి వచ్చింది. భాగ్యనగరంలో నిజాం నవాబుల కాలంలో రూపొందిన సీతారాంబాగ్, కిషన్‌బాగ్, కంచన్‌బాగ్ తదితర బాగ్, మలక్‌పేట, ధూల్‌పేట తదితర పేటలు, చాంద్రాయణగుట్ట తదితర గుట్టల రూపంలో ఏర్పడిన ప్రాంతాలే అత్యధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల కారణంగానే అవసరమైన స్థాయిలో రోడ్లు, సమాంతర మార్గాలు లేకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు తీరడం లేదు.
జనరల్ బజార్ నుంచి వెళ్లే రద్దీ ప్రభావం సర్దార్‌పటేల్ రోడ్డు, మహాత్మాగాంధీ రోడ్లపై పడకుండా ఉండేందుకు హైదర్‌బస్తీ నుంచి నెక్లస్‌రోడ్డు మీదుగా బేగంపేటకు మార్గం అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల రాష్ట్రపతిరోడ్డు, మహాత్మాగాంధీరోడ్లతో పాటు ప్యాట్నీ, ప్యారడైజ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గి వాహనాలు సజావుగా ముందుకు వెళ్తాయి. రంగ్‌మహల్ నుంచి ఎంజీబీఎస్ వరకు మూసీ మీదుగా వంతెన నిర్మాణం చేపట్టాలని దీంతో సెలవుదినాలు, పండుగల సమయంలో ఆర్టీసీ, స్పెషల్ బస్సుల రద్దీతో ఇటు అఫ్జల్ గంజ్ నుంచి అటు చాదర్‌ఘాట్ వరకు రాత్రివేళల్లో ట్రాఫిక్ జామ్‌ల నిరోధానికి ఉపయోగపడుతుందని, రంగమహల్ చౌరస్తా కేంద్రంగా చాదర్‌ఘాట్, మెడికల్ కాలేజీ, ఇమ్లిబన్ మార్గాలన్నీ రద్దీ తగ్గుతాయని ప్రతిపాదించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లను కలిపే ట్యాంక్‌బండ్ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. సయిదానిమా సమాధి వెనుక నుంచి నాలాపై బ్రిడ్జి నిర్మాణం చేపడితే ట్యాంక్‌బండ్ నుంచి రాణిగంజ్ వరకు మార్గం ఇరువైపులా రద్దీ తగ్గుతుందని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల పార్కింగ్‌కు తీవ్ర సమస్య ఉందని, ఈ నేపథ్యంలో మోండామార్కెట్ను తరలించాలని కోరారు.
పాత గాంధీ ఆసుపత్రిని మరమ్మతులు చేయడంతో పాటు ఆర్టీసీ సెంట్రలైజ్డ్ డిపో ఏర్పాటు చేస్తే సికింద్రాబాద్‌లో ఉన్న వివిధ బస్‌స్టాప్‌ల కారణంగా ఏర్పడుతున్న రద్దీ తగ్గుతుందని, పార్కింగ్ సమస్యలు కూడా తీరుతాయని పోలీసు విభాగం జీహెచ్ఎంసీకి ప్రతిపాదనలు పంపింది. వీటితో పాటు మరో ప్రధాన సమస్యపై దృష్టిపెట్టాలని పోలీసులు సూచించారు. నగరంలోకి వస్తూ పోతున్న ప్రైవేటు బస్సులు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తూ, వేగంగా వెళ్లడం ద్వారా ట్రాఫిక్ జామ్‌కు, ప్రమాదాలకు కారణమవుతున్నాయని, నగరం వెలుపల కొన్ని పాయింట్లను గుర్తించి అక్కడ ప్రైవేటు బస్సుల కోసం స్టాప్స్ నిర్మిస్తే బాగుంటుందని, దీనివల్ల చాలా సమస్య తీరుతుందని హైదరాబాద్ పోలీసులు సూచించారు.
జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణతో పాటు పోలీసు కమిషనరేట్ల విభజన కూడా జరిగి నగరం నాలుగుకమిషనరేట్లుగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ అతిపెద్ద కమిషనరేట్‌గా రూపొందగా సిటీ సెంట్రల్లోకి నగరం చుట్టుపక్కల నుంచి వచ్చే వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయితే ఇతర కమిషనరేట్ల సమన్వయంతో ఈ రద్దీని నియంత్రించి నగరంలో ట్రాఫిక్ సమస్యలు తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా.. ప్రస్తుతం ఈ విభజన ఒక కొలిక్కి రావడానికి ఎంత కాలం పడుతుందో తెలియదని వారంటున్నారు.
సాంకేతికంగా ఉన్న అంశాలు పోలీసు కమిషనరేట్ల విభజనకు కొంత అడ్డంకిగా మారుతుండగా, జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎలాంటి ప్రతిపాదనలు ముందుకుసాగవని చర్చ జరుగుతుంది. అంతే కాకుండా పోలీసులు పెట్టిన ప్రతిపాదనలు స్థానిక నాయకులకు కొంతమేరకు ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయని, పాతబస్తీలో ఈ సమస్య అధికంగా ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నా పోలీసుల ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితేనే ట్రాఫిక్ సమస్య తీరుతుందని ఆ అధికారి చెప్పారు.