సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలు నీట మునిగి ఇండ్లలోకి నీరు చేరడంతో సామగ్రి ధ్వంసమైంది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి వైఫల్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ముషీరాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు బాసటగా నిలుస్తున్నారు.
సహాయక చర్యలను వేగవంతం చేస్తూ.. బీఆర్ఎస్ శ్రేణులను నిత్యం ప్రజల్లో ఉండేలా చూస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ అధికారులు ఇండ్ల నుంచి బయటకు రాకున్నా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు దన్నుగా నిలుస్తున్నారు. ఎక్కడికక్కడ వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత ప్రజలకు ధైర్యం చెప్తున్నారు. అవసరమైన చోట వారికి నిత్యావసరాలు, ఆహారం అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు. వర్ష ప్రభావాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆయా కాలనీల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండేలా ముందస్తు సమాచారం చేరవేస్తూ.. అండగా ఉంటున్నారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ..
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బల్కంపేట, బేగంపేట ఆర్యూబీ కింద ప్రమాదకర స్థాయిలో వరద నీరు చేరి యువకుడు మృతి చెందిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆర్యూబీ కింద వరద నీరు ప్రమాదకర స్థాయిలో చేరినా పోలీస్ యంత్రాంగం మొద్దు నిద్రతో నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మృతి చెందిన షర్ఫుద్దీన్ (25) కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. అనంతరం సికింద్రాబాద్‌లోని మినిస్టర్ రోడ్డు కురిసిన భారీ వర్షానికి ముంపునకు గురైన కాచ్బౌలి, నల్లగుట్ట జూలమ్మ టెంపుల్ ప్రాంతాల్లో పర్యటించారు. అదేవిధంగా బేగంపేట పరిధిలోని రాంగోపాల్‌పేటలో నీట మునిగిన ప్రాంతాలకు వెళ్లి బాధితుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.
బాధితులకు అండగా ఉం టామని హామీ ఇచ్చారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్ పర్యటించారు. రామ్‌నగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లి, శ్రీరామ్‌నగర్ కమాన్ బస్తీలను సందర్శించారు. బస్తీల్లో వరద నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని కాలనీ ప్రజలకు భరోసా కల్పించారు. వరద ప్రభావ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధితులకు అండగా నిలిచారు. పలుచోట్ల సహాయక చర్యల్లో వర్షంలో తడుస్తూ పాల్గొన్నారు. వరద బాధితులకు ధైర్యం చెప్తూ అందుబాటులో ఉంటున్నారు.
మెట్టుగూడ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్పొరేటర్ రాసూరి సునీత రాత్రంతా వర్షంలోనే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరద చేరిన ప్రాంతాల్లో పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించి బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జోనల్ కమిషనర్ రవికిరణ్‌తో మాట్లాడి మరోసారి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావొద్దని, పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావ ప్రజలు భయాందోళనకు గురికావొద్దని మనోధైర్యం చెప్పారు.