సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): టికెట్ వస్తుందో.? రాదో తెలియని అయోమయ పరిస్థితి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లో ఉంటే.. అధికార పార్టీలో మాత్రం గడిచిన నెలన్నర రోజులకు పైగా అభ్యర్థులంతా నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. ఒకవైపు పాదయాత్రలు, అత్మీయ సమావేశాలు, మరోవైపు సంక్షేమ ఫలాలను అర్హులకు అందజేస్తూ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.
బీసీ కులవృత్తులతో పాటు మైనార్టీలకు రూ. లక్ష సాయం, గృహలక్ష్మి అర్హుల ఎంపిక, డబుల్ బెడ్ర్రూం ఇండ్ల పంపిణీ, దివ్యాంగుల పింఛన్ , దళిత బంధు వంటి అనేక ప్రభుత్వ పథకాలతో క్షేత్రస్థాయిలో అలుపెరగకుండా పర్యటిస్తుండటంతో ప్రతిపక్ష పార్టీల నేతలు ఠారెత్తిపోతున్నారు. వివిధ పార్టీల నుంచి రోజుకో చోట భారీగా బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతుండటంతో పార్టీ క్యాడర్ జోష్ మీదున్నది. ఈ నేపథ్యంలోనే పాదయాత్రలు ముగిసిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రగతి నివేదన సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పనిచేశాం.. ఆశీర్వదించండి.. అంటూ ప్రజలకు చేరవైన ఎమ్మెల్యేలు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అస్ర్తాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు.
ప్రగతి నివేదన సభలు..
హైదరాబాద్ అభివృద్ధి అంటే తారక రామారావు అనేది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కేటీఆర్‌ను తమ నియోజకవర్గానికి తీసుకువచ్చి ఆయన నోట అభివృద్ధిని వివరించడంతో ప్రజల్లో మరింత ఆదరణ చూరగొనాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు ప్రగతి నివేదన సభను నిర్వహించ తలపెట్టారు. ఈ సభకు మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును ఆహ్వానించి నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించాలని భావిస్తున్నారు. ఇప్పటికే సనత్‌నగర్, ఎల్బీనగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో అటు క్యాడర్లో జోష్, ఇటు ప్రజల్లో అభివృద్ధిపై విస్తృత చర్చ జరుగుతోంది. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం ప్రగతి నివేదన సభ ద్వారా నియోజకవర్గంలో పదేండ్ల తెలంగాణ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ ప్రగతిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆదర్శంగా నిలిచింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్‌తో ‘ఆసరా’గా నిలిచింది. ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌తో చేయూతనందించింది. రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతకు ఆత్మబంధువై నిలిచింది. మాతా శిశు సంరక్షణకు కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టింది. యాదవులకు గొర్రెల పంపిణీ, రజకులు, మత్స్యకారులు, నాయీ బ్రహ్మణులకు.. ఇలా సబ్బండ వర్ణాలకు బాసటగా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ఏదో రూపంలో ఇంటింటికీ లబ్ధి చేకూర్చింది. ఏ రకంగా చూసుకున్నా.. ప్రతి కుటుంబానికీ ఒకటి నుంచి రెండు పథకాలు వర్తించాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా అభ్యర్థులను నిండు మనస్సుతో దీవిస్తున్నారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పేదల పక్షాన బీఆర్ఎస్ అండగా నిలబడుతున్నదని కొనియాడుతున్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆశీర్వదిస్తున్నారు. ఆర్థిక స్థోమతలేక బడుగు బలహీన వర్గాల సమున్నత అభివృద్ధి కోసం, వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు కృతనిశ్చయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకుసాగుతున్న తీరుపై వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థులకు వస్తున్న ఈ అపూర్వ స్పందనను చూస్తే భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.