సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో కల్తీఫుడ్, నాణ్యత లేని ఆహారంతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నది. ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో కల్తీ కలకలం సృష్టిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నా వ్యాపారస్తులు మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఒక్కో సర్కిల్లోని ఐదు స్వీట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు 27 స్వీట్ షాపులలో ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఎక్కువగా ఎక్స్‌ఫైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియమ్స్ వాడుతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాపులలో విక్రయిస్తున్న వస్తువులకు ఎలాంటి లేబుల్, ఎక్స్పైరీ డేట్ లేదని, కిచెన్‌లో పనిచేసే వారు హెడ్ కాప్స్, యాప్రాన్స్, గ్లౌజ్‌లు వాడటంలేదని, కీటకాలను నిరోధించడానికి కిటికీలకు మెష్‌లు అమర్చడంలేదని తేల్చారు. వంటగదిలో ఎగ్జాస్ట్‌లు, గోడలు, పైకప్పులు అపరిశుభ్రమైన వాతావరణంలో జిడ్డుగా ఉండటం, వాషింగ్ ఏరియా, వంటగదిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదని, ఓపెన్ డస్ట్బిన్లు, వినియోగించే పాత్రలు శుభ్రంగా లేవని గుర్తించి సంబంధిత షాపుల యజమానులకు నోటీసులు, జరిమానాలు విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.