KTR | బడంగ్ పేట, ఫిబ్రవరి 18: మహేశ్వరం నియోజకవర్గమంతా గులాబీమయంగా మారింది. ఆమనగల్లో నిర్వహించిన రైతు ధర్నాకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీగా తరలి వెళ్లారు. తుక్కుగూడ దగ్గర సబితా ఇంద్రారెడ్డి ఏర్పాటు చేయించిన గులాబీ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదగా ఎగురవేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను సబితా ఇంద్రారెడ్డి గజమాలతో సత్కరించారు. జేసీబీల సహాయంతో దారి వెంట కేటీఆర్‌పై గులాబీల వర్షం కురిపించారు. కేటీఆర్‌కు తుక్కుగూడ బీఆర్ఎస్ నాయకులు నాగలిని బహూకరించారు. మొత్తమ్మీద శ్రీశైలం హైవే జనసంద్రంగా మారింది.
కేటీఆర్ వస్తున్న విషయం తెలుసుకొని మహేశ్వరం మండలంలోని వివిధ గ్రామాలు, బాలాపూర్ మండలంలోని మీర్ పేట, బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్, జల్ పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీ ల నుంచి, ఆర్కే పురం సరూర్‌నగర్ డివిజన్లో నుంచి, కందుకూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. తుక్కుగూడ నుంచి ఆమనగల్ వరకు రోడ్డుకు ఇరువైపులా గులాబీ తోరణాలు దర్శనమిచ్చాయి. పెద్ద పెద్ద హోల్డింగ్లతో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. రోడ్డుపై ఎక్కడ చూసినా కారు జోరు కనిపించింది. గులాబీ పువ్వులు చల్లుతూ స్వాగతం పలికారు.
శ్రీశైల హైవేపై ఉన్న గులాబీ శ్రేణులకు, రైతులకు, ప్రజలకు కేటీఆర్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి వెంట ఎక్కడ చూసినా గులాబీ దళం కవాతు చేసినట్లు కనిపించింది. కేటీఆర్ తో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, రామిడి రాంరెడ్డి, అర్కల కామేశ్ రెడ్డి, లక్ష్మయ్య, రాజు నాయక్, కర్రోల్ల చంద్రయ్య , మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, రైతులు తదితరులు ఉన్నారు.