మేడ్చల్, మే7 (నమస్తే తెలంగాణ): ఎలివేటేడ్ కారిడార్ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ రింగ్‌రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న కారిడార్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ పక్రియకు ఓ వైపు రక్షణ శాఖ కొర్రీలు, మరోవైపు స్థానికుల వ్యతిరేకతతో బ్రెక్ పడిన విషయం విదితమే. అయితే భూ సేకరణ పక్రియపై ఇదివరకు ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలను గ్రామస్తులు బహిష్కరించి న్యాయస్థానాలను ఆశ్రయించారు.
ఈ క్రమంలో తిరిగి ఈనెల 9న గ్రామాలకు సంబంధించిన గ్రామసభను లోతుకుంటలో రెవెన్యూ అధికారులు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని తూకుంట నుంచి శామీర్‌పేట్ రింగ్ రోడ్డు వరకు 12 కిలోమీటర్ల పొడువైన రోడ్డు విస్తరణకు అవసరమైన భూమిని గుర్తించి వారికి నోటీసులు జారీచేసి భూ సేకరణకు సహకరించేలా గ్రామసభలను నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే తూకుంట, హకీంపేట్, పోతాయిపల్లి గ్రామాలకు సంబంధించిన రైతులు తమ భూములను ఇవ్వమంటూ గతంలో నిర్వహించిన గ్రామసభను బహిష్కరించడమే కాకుండా కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
100 ఫీట్ల వరకే భూ సేకరణ చేయాలి..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి 200 ఫీట్ల రోడ్డు విస్తరణ వల్ల తాము నష్టపోతామని తమకు నష్టం జరగకుండా చూడాలని తూకుంట, పోతాయిపల్లి, హకీంపేట్ గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 200 ఫీట్ల రోడ్డు విస్తరణతో ఇండ్లతో పాటు వ్యవసాయ భూములను కోల్పోతున్న దృష్ట్యా 100 ఫీట్ల రోడ్డు విస్తరణను మాత్రమే చేయాలని కోరుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 12 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ చేయాల్సి ఉండగా హైదరాబాద్ జిల్లాలోని లోతుకుంట నుంచి ప్యారడైజ్ వరకు 6 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ చేయాల్సి ఉంటుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాతో పాటు హైదరాబాద్‌కు చెందిన పలువురు రోడ్డు విస్తరణపై న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం విదితమే.ఆది నుంచీ ఎలివేటెడ్ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పడం లేదు. ముందు రక్షణ శాఖ అధికారులు భూకేటాయింపునకు ససేమిరా అనగా.. స్థానికులు సైతం రోడ్డు విస్తరణకు భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంతో ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మారింది.