సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): మెట్రో రైలు రెండో దశలోనే ఫోర్త్ సిటీకి మెట్రో కారిడార్‌ను నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రెండో దశకు పరిపాలనా అనుమతులు ఇవ్వడం, అందులో 5 కారిడార్లతో పాటు ప్రత్యేకంగా ఫోర్త్ సిటీ మెట్రో కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం ఫోర్త్ సిటీ నుంచి ఇప్పటికిప్పుడు పట్టుమని పదివేల మంది ప్రయాణం చేసే అవకాశం లేదు.
కానీ అదే ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలైన మేడ్చల్, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, శామీర్‌పేట, అల్వాల్, తూంకుంట, బోయిన్పల్లి ప్రాంతాల నుంచి లక్షలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. సుమారు ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో 30 లక్షల మంది జనాభా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారంతా మౌనంగా చూస్తూ ఊరుకుంటారనుకుంటే అవివేకమే అవుతుంది.
ఇది ప్రభుత్వ పెద్దలు ఎంత తొందరగా గ్రహిస్తే అంతమంచిది’ అని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిది సంపత్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఈ సమయంలో మనం ఎనుకున్న ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మౌనంగా ఉండకూడదని మా అభిప్రాయం. వారు తక్షణమే దీనిపై స్పందించి ఉత్తర హైదరాబాద్‌కు మెట్రో కారిడార్ల నిర్మాణం విషయంలో జరిగిన అన్యాయాన్ని ఖండించడం అత్యవసరం. ప్రజా ప్రతినిధులుగా ప్రజల అవసరాలను తీర్చేలా స్పందించాల్సిన బాధ్యత వాళ్లదే’ అని సంపత్ రెడ్డి స్పష్టం చేశారు.