బడంగ్‌పేట, నవంబర్ 10: ప్రభుత్వ పాఠశాలలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. సరికొత్త హంగులతో సర్కారు బడుల రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. మహేశ్వరం నియోజక వర్గంలో మొదటి దశలో 54 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి, వాటి అభివృద్ధికి రూ.10.58కోట్లు మంజూరు చేసింది. జిల్లెలగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, మీర్‌పేట ప్రాథమిక పాఠశాల, మహేశ్వరం మండలంలోని మన్సాన్పల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో మన ఊరు మనబడిలో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేశారు. మిగిలిన పాఠశాలల్లో 70 శాతం పనులు పూర్తి చేశారు. పనులు పూర్తి అయిన పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడంతో ఈ ఏడాది అడ్మిషన్లు భారీగా పెరిగాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అయితే నో అడ్మిషన్ బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటం గమనార్హం.
పాఠశాలలో చేసే అభివృద్ధి పనులు
మన ఊరు మన బడిలో భాగంగా పాఠశాలలకు రంగులు వేస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడానికి డైనింగ్ హాల్ నిర్మిస్తున్నారు. టాయిలెట్స్, కిచెన్‌షెడ్, ప్రహారి, అదనపు తరగతి గదులు, కిటికీలు, డోర్లు, కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ వైరింగ్, ఫ్యాన్లు, ఫ్లోరింగ్, మెట్లు, బోర్లు, ఇతర మరమ్మతులు చేస్తున్నారు. అలాగే వాటర్ ట్యాంక్‌లు నిర్మించి, గ్రీనరీ పెంపుదలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేస్తాం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చి దిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో 12 అంశాలను తీసుకున్నాం. మొదటి విడతలో రూ.3500 కోట్లతో 9 వేల పాఠశాలలో పనులు చేపడుతున్నాం. రంగారెడ్డి జిల్లాలో 464 పాఠశాలలో మొదటి విడతలో రూ.200 కోట్లతో పనులు చేపడుతున్నాం. మహేశ్వరం నియోజకవర్గంలో రూ.10.59 కోట్లతో 54 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. దశల వారిగి అన్ని పాఠశాలల రూపురేఖలను మార్చి వేస్తాం.
– మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి
ఆరోగ్యకర వాతావరణం.. అత్యుత్తమ ఫలితాలు..
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం చాలా గొప్పది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. పాఠశాల వాతావరణం బాగుంటే ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యకర వాతావరణంలో విద్యార్థులు బాగా చదువుకుంటారు. అత్యుతమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది.
– డి. కృష్ణయ్య విద్యాధికారి