Boduppal | బోడుప్పల్, మార్చి 11: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని 12, 13 డివిజన్లలోని ప్రభుత్వ స్థలానికి రాత్రికి రాత్రే రెక్కలు వస్తున్నాయని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఆరోపించారు. మంగళవారం గౌతమ్ నగర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బోడుప్పల్ సర్వే నంబర్ 63/28 నుండి 63/39లో 1984 సంవత్సరంలో లేఔట్ ఏర్పాటు చేశారు. కానీ అది ప్రభుత్వ స్థలం అధికారులు నిర్ధారించి అందులోని క్రయవిక్రయాలను నిలిపివేశారని తెలిపారు. కాగా స్థానిక కాంగ్రెస్ నాయకుల అండదండలతో గత మూడు నెలల కాలంలో 30 అక్రమ నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు.
ప్రభుత్వ స్థలానికి నోటరీ దస్తావేజులు సృష్టించి 50 చదరపు గజాల స్థలాన్ని రూ 5 లక్షలు చొప్పున సుమారు 30 మందికి విక్రయించి రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టారని ఆయన ఆరోపించారు. స్థానిక తాసిల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారని ఆయన అన్నారు. ఒకటి రెండు నిర్మాణాలు కూల్చిన తిరిగి రాత్రికి రాత్రే నిర్మాణం చేపట్టి సున్నం వేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. స్థానిక నాయకుల అండదండలతో అధికారులు అందిన కాడికి దండుకొని ప్రభుత్వ స్థలం యదేచ్చగా కబ్జా అవుతున్న మిన్నకుంటున్నారని అన్నారు.
బోడుప్పల్ సర్వే నంబర్ 63/1 లో 1200 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని 50 గజాల చొప్పున నోటరీ దస్తావేజులు సృష్టించి అమాయకులైన పేదవారికి విక్రయింస్తూ కబ్జాదారులు అందిన కాడికి దండుకుంటున్నారని విమర్శించారు.
ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఆయన తెలిపారు. తాసిల్దార్ కార్యాలయం ముందు, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి చంటి శ్రీనివాస్, స్థానిక నాయకులు బోడగళ్ల సదానంద్ తదితరులు పాల్గొన్నారు.