Hyderabad | బంజారాహిల్స్, జూలై 13 : పేదలు నివాసం ఉంటున్న బస్తీల్లో పది గజాల స్థలం కబ్జా అయితే ఆఘమేఘాల మీద వచ్చి కూల్చిపారేసే రెవెన్యూ సిబ్బంది.. నాలాకు సమీపంలో ఉందంటూ రాత్రికి రాత్రే పేదల గుడిసెలను నిర్దాక్ష్యణ్యంగా తొలగించే హైడ్రా.. రోడ్డుపక్కన చిన్న టీ స్టాల్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తుంటే క్రేన్లతో వచ్చి ఈడ్చిపారేసే ట్రాఫిక్ పోలీసులు.. నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్‌లో సుమారు ఎకరన్నర ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్నారు.
విశాలమైన నందినగర్ గ్రౌండ్స్‌లో అధికారపార్టీ నేతల అండదండలతో లెక్కకుమించి ఆక్రమణలు కళ్లముందే కనిపిస్తున్నా వాటిని తొలగించడంలో తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తున్నారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో పేదలు నివాసం ఉంటున్న పలు బస్తీలకు బస్సు సౌకర్యం కరువయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండలం సర్వే నెంబర్ 403లోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నెం 14 నందినగర్‌లో సుమారు 2 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలం మొత్తాన్ని నందినగర్ గ్రౌండ్స్‌గా పిలుస్తుంటారు. ఏడాదిన్నర క్రితం దాకా నందినగర్‌కు పలు ప్రాంతాలనుంచి ఆర్టీసీ బస్సులు వచ్చేవి. నందినగర్ గ్రౌండ్స్‌కు సమీపంలోని నందినగర్, వెంకటేశ్వరనగర్, ఇబ్రహీంనగర్, నూర్‌నగర్, గురుబ్రహ్మనగర్ తదితర బస్తీలు ఉంటాయి.ఈ బస్తీలనుంచి నిత్యం వేలాదిమంది పేద, మద్యతరగతి ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు.
అయితే నందినగర్ గ్రౌండ్స్‌లో గత కొన్నినెలలుగా స్థానిక నేతల అండదండలతో వెలిసిన ఆక్రమణల కారణంగా ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు అవకాశం లేకుండా పోయింది. గ్రౌండ్లో ఇష్టారాజ్యంగా హోటళ్లు, టీస్టాల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేయించిన స్థానిక నేతలు వారివద్దనుంచి వేలాది రూపాయల అద్దెలు వసూలు చేయడం ప్రారంభించారు. దీనికితోడు ఖాళీ స్థలంలో ఇసుక, ఇటుక వ్యాపారాలు చేస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలకు ఈ ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణదారులనుంచి కొంతమంది నేతలు సుమారు రెండు లక్షలదాకా అద్దెల రూపంలో వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖరీదైన ఖాళీ ప్రభుత్వ స్థలంలో సుమారు ఎకరన్నర స్థలంలో 30దాకా ఆక్రమణలు వెలిసినా స్థానిక రెవెన్యూ,జీహెచ్ఎంసీ, హైడ్రా,ట్రాఫిక్ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి నందినగర్ గ్రౌండ్స్‌లో ఆక్రమణలను తొలగించి ఆర్టీసీ బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
పోలీసు బందోబస్తు కోసం ప్రయత్నిస్తున్నాం : తహసీల్దార్ అనితా రెడ్డి
బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్ గ్రౌండ్స్‌లోని ప్రభుత్వ స్థలంలో ఆక్రమణల విషయంపై మాకు ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ స్థలంలో వెలిసిన ఆక్రమణలను తొలగించే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల బందోబస్తు కోసం దరఖాస్తు చేశాం. వివిద కారణాలతో బందోబస్తు లభించకపోవడంతో ఆక్రమణల తొలగింపు ఆలస్యమయింది. త్వరలోనే పోలీసుల బందోబస్తుతో ఆక్రమణలను తొలగిస్తాం.