Chitra Layout | ఆర్కేపురం, మార్చి 19 : ఆర్కేపురం డివిజన్ చిత్రా లేఅవుట్ కాలనీలో హెచ్ఎండీఏకు సంబంధించిన విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా కోర్టు పక్కన హెచ్ఎండీఏ 1999లో 28 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ చేసింది. 53 ఓపెన్ ప్లాట్లను చేసి, సుమారు 1000 ఫ్లాట్లతో కూడిన 50 అపార్ట్మెంట్స్ భవనాలను నిర్మించి వివిధ గ్రూప్ హౌసింగ్ డెవలపర్లకు 2003-04 లో బహిరంగ వేలంలో విక్రయించారు. లేఅవుట్ చేసిన సమయంలో లేఅవుట్ ఉత్తరం వైపు 3000 చదరపు గజాల భూమిని కమ్యూనిటీ హాల్, సామాజిక కార్యక్రమాల కోసం ఖాళీ స్థలాన్ని వదిలేశారు. ఇటీవల కాలంలో పక్కనే నివాసముండే ఎన్టీఆర్ నగర్ బంజారా బస్తీ వాసులు ఆ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చిత్రలే అవుట్ కాలనీవాసులు తెలిపారు.
ఈ విషయంపై హెచ్ఎండీఏ కమిషనర్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, సరూర్‌నగర్ సర్కిల్ ఉప కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని కాలనీవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతున్నారు.