సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ) : నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకే ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న భూములకు, వేర్వేరు రకాల పరిహార విధానాలను అమలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతున్నది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన ఆస్తుల విషయంలో ఇచ్చే పరిహారంలో వ్యత్యాసాలపై ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేటు ఆస్తుల యజమానులకు కోలుకోలేని నష్టం వాటిల్లేలా చేస్తుందని బాధితులు వాపోతున్నారు. మొత్తం రూ. 22232.89 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ 18 కిలోమీటర్ల ఆరు లేన్ల కారిడార్ కోసం ఒకవైపు రక్షణ శాఖ భూములకు కోట్లాది రూపాయల ప్రజాధనంతో కొత్త భవనాలు నిర్మిస్తున్నారన్నారు. మరోవైపు దశాబ్దాలుగా అదే ప్రాంతాన్ని నమ్ముకుని జీవిస్తున్న ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారుల ఆస్తుల పరిహారం విషయంలో మాత్రం ప్రభుత్వం కొర్రీలు పెడుతుండటం గమనార్హం.
114 ఎకరాల రక్షణ భూమి..
ఈ ప్రాజెక్టు కోసం సుమారు 114 ఎకరాల రక్షణ భూమిని ప్రభుత్వం సేకరించింది. అయితే ఈ భూమికి ప్రతిగా రక్షణ శాఖకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించడమే కాకుండా, భూసేకరణ వల్ల దెబ్బతినే ఐదు ప్రధాన మిలిటరీ నిర్మాణాలను హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ స్వయంగా కోట్లాది రూపాయల వ్యయంతో పునర్ నిర్మిస్తుందన్నారు. మిలిటరీ నిర్మాణాల కోసం కేటాయిస్తున్న నిధుల వివరాల ప్రకారం… డీజీక్యూఏ, హెడ్ క్వార్టర్ డివిజన్ ఏరియా కోసం రూ. 7.20 కోట్లు, ఎస్క్యూఏఈ ఆర్మెంట్స్ పనులకు రూ. 6.81 కోట్లు, అల్వాల్ జంక్షన్ సమీపంలోని జేసీవోల వసతి గృహాలకు రూ. 5.95 కోట్లు, లోతుకుంట జంక్షన్ సమీపంలోని త్రిశూల్ లైన్స్ రూ. 5.72 కోట్లు, ట్రైనింగ్ బెటాలియన్ సదుపాయాలు, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరిధిలోని రక్షణ శాఖ నిబంధనలకు అనుగుణంగా కేవలం ఆరు నెలల కాలపరిమితితోనే కొత్త కంపౌండ్ వాల్స్, అండర్ గ్రౌండ్ వాటర్ సంపులు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థలను నిర్మించేందుకు సన్నద్ధమైంది. రక్షణ శాఖ కార్యకలాపాలకు చిన్న అంతరాయం కూడా కలగకుండా అన్ని తానై చూసుకుంటున్నది.
ప్రైవేటు ఆస్తులపై కొర్రీలు…
మరోవైపు ్రప్రైవేటు ఆస్తుల విషయంలో సర్కారు కొర్రీలు పెడుతుంది. వెస్ట్ మారేడుపల్లి నుంచి కర్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, ఆల్వాల్, హకీంపేట్, తూంకుంట పరిధిలోని సుమారు 78 ఎకరాల ప్రైవేటు భూములు, వందలాది ఇండ్లు, వాణిజ్య సముదాయాలను సేకరించాల్సి ఉంది. అయితే ఈ ప్రైవేటు ఆస్తుల యజమానుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వైఖరి అత్యంత దారుణంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. డిఫెన్స్ సంస్థలకు కోట్లు కుమ్మరించి, అత్యాధునిక వసతులు కల్పిస్తున్నామన్న ప్రభుత్వం… దశాబ్ధాలుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ, పన్నులు కడుతున్న తమకు మార్కెట్ ధరల కంటే తక్కువ పరిహారం ఇవ్వడానికి సిద్ధం అవుతుందని ఆవేదన చెందుతున్నారు.
భూసేకరణ చట్టాల పేరుతో నష్టపరిహారంలో కొర్రీలు పెడుతుందన్నారు. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులకు ఇచ్చే పరిహారంలో తీవ్రమైన కోతలు విధిస్తుందన్నారు. కాలయాపన చేస్తుండటంతో స్థానిక నివాసితులు, చిన్న వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. ఎలివేటెడ్ కారిడార్ వల్ల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నది ఎంత నిజమో… ఈ ద్వంద్వ నీతి వల్ల వందలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతినబోతుందనీ అంతే నిజమాన్నారు. అయితే ఒక ప్రాజెక్టు కోసం భూమిని కోల్పోతున్నప్పుడు ప్రభుత్వానికి రక్షణ శాఖ భూమి ఎంత ముఖ్యమో…? సామాన్యుడి ఆస్తులుకు ఇచ్చే పరిహారం కూడా అంతే ముఖ్యమన్నారు. రక్షణ శాఖతో సమన్వయం పేరిట వారి షరతులకు తలొగ్గి, రూ. కోట్లు వెచ్చించి భవనాలు కట్టిస్తున్న రేవంత్ సర్కారు… మరీ ప్రైవేటు ఆస్తుల విషయంలో ఎందుకు లొసగులను వెదుకుతుందనీ నిలదీస్తున్నారు.