సిటీబ్యూరో, నవంబర్ 5(నమస్తే తెలంగాణ) : అంగట్లో అరువు నెత్తిమీద బరువు చందంగా మారిన హైదరాబాద్ మెట్రో భారాన్ని మోయలేక నగరవాసులపై ధరల బాంబులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతున్నది. మెట్రో నిర్వహణ నుంచి ఎల్అండ్టీని తప్పించి కొనుగోలు చేసిన మెట్రో వాటాతో అప్పుల కొరివితో తలగోక్కునే పరిస్థితి వచ్చింది. ఆదాయం కంటే నిర్వహణ, అప్పుల భారమే ఎక్కువగా ఉన్న మెట్రో గుదిబండను మోయలేక ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనున్నది. ఆ తర్వాత మెట్రో టికెట్ చార్జీల భారాన్ని నగరవాసులను ముక్కు పిండి మరీ వసూలు చేసేందుకు అడుగులు వేస్తున్నది. నగరంలో 67 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్న మెట్రో రైలు ద్వారా నిత్యం 5.5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అయితే టికెట్, రియల్ ఎస్టేట్‌తోపాటు, ప్రకటనల రూపంలో వచ్చే రెవెన్యూ అంచనాలకు చేరకపోవడంతో మెట్రో ప్రారంభించిన ఏడాదిలోనే అప్పుల భారం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 6.5వేల కోట్ల అప్పుల భారాన్ని మోస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి రూ. 2 వేల కోట్ల వాటాతోపాటు, రూ. 13.5వేల కోట్ల అప్పులతో రేవంత్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారం తర్వాత మరో 50ఏళ్ల పాటు నిర్వహించుకునే పరిమితి ఉన్నా..ఎల్అండ్టీ మోయాల్సిన బరువును కాంగ్రెస్ అనవసరంగా నెత్తినేసుకున్నది.
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతోనే మెట్రో నిర్వహణ సౌలభ్యం కోసం టికెట్ ధరలను 50 శాతం పెంచింది. అదే విధానాన్ని తెలంగాణ కాంగ్రెస్ సర్కారు కూడా అమలు చేసింది. దీంతో టికెట్ ధరలు గరిష్ఠంగా రూ. 70లకు చేరింది. తాజాగా మెట్రో విస్తరణ కోసం సాగిపోతున్న ఎల్అండ్టీ సంస్థతో తెగదెంపులు చేసుకున్న సర్కారు.. మొత్తంగా రూ. 15 వేల కోట్ల భారాన్ని మోయనుండగా.. దీనికి అదనంగా నిర్వహణ, వార్షికంగా వచ్చే వడ్డీల భారాన్ని కలుపుకొంటే… ఏటా ఇప్పుడు వచ్చే నష్టాలు రూ. 600 కోట్ల నుంచి మరో రూ. 650-700 కోట్లకు భారం పెరిగిన మెట్రో సంస్థ ఏటా రూ. 1300-1400 కోట్ల భారం పడనుంది. 2024-25 మెట్రో ఆర్థిక నివేదిక ప్రకారం మెట్రోకు వచ్చే రెవెన్యూలో నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.
మెట్రో నిర్వహణ విషయంలో ఎల్అండ్టీ మెట్రో సంస్థ మొదటి నుంచి అప్పుల భారంతోనే నెట్టుకొస్తున్నది. 2018 నుంచి పూర్తి స్థాయిలో మెట్రో అందుబాటులోకి వచ్చినా.. అంచనాలకు తగినట్లుగా రెవెన్యూ, ప్రయాణికులు పెరుగలేదు. దీంతో అనివార్యంగానే ఇన్నాళ్లు నష్టాల భారాన్ని మరో 35-40 ఏళ్లు మోయాల్సి ఉండేది. కానీ మెట్రో విస్తరణ పేరిట, ఎల్అండ్టీ సంస్థతో రేవంత్ రెడ్డి పంథానికి పోవడంతో నగర మెట్రో నిర్వహణ నుంచి తప్పుకోవడమే ఉత్తమమనే ఆలోచనకు ఆ సంస్థ వచ్చింది. దీనికి సీఎం వ్యవహార తీరుతో రాష్ట్ర ఖజానాపై పడే రూ. 15వేల కోట్లతోపాటు ఏటా వచ్చే రూ. 1300-1400 కోట్ల వడ్డీ, నిర్వహణ భారం అదనంగా మారనుంది. వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడున్న టికెట్ ధరలను వంద శాతం పెంచినా.. బ్రేక్ ఈవెన్ రావడానికి కనీసం 30-35ఏళ్లు సమయం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంటే అప్పటివరకు మెట్రో నిర్వహణ భారాన్ని మోస్తూ రెండింతలు పెరిగే టికెట్ ధరలతో నగరవాసులు నెట్టుకు రావాల్సిందే. అదే గనుక జరిగితే ఇప్పుడున్న గరిష్ఠ టికెట్ ధర ఏకంగా రూ. 100 దాటే అవకాశం ఉంది. దీంతో చివరకు నగరవాసులకు అత్యంత ఖరీదైన రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో మిగిలిపోనుంది. ఇక ఈ భారాన్ని మోయడం ఎందుకని సర్కారు ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నది.
ప్రస్తుతం ఉన్న 67 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను రెండో దశ విస్తరణలో 144కిలోమీటర్ల మేర పొడిగించేందుకు రూ. 45వేల కోట్ల అంచనాతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో సగానికి కంటే ఎక్కువ అనగా రూ. 25-30వేల కోట్లు వడ్డీల రూపంలో ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవాల్సిందే. ప్రభుత్వం వద్ద చిల్లి గవ్వ లేకుండానే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కానీ ఇప్పుడున్న అప్పుల భారం, అదనంగా రాబోయే అప్పులు కలిపితే మెట్రో పేరిట మొత్తంగా రూ. 30-45 వేల కోట్లు కానున్నాయి. వీటి వడ్డీ భారం కూడా 10-11 శాతం పైనే ఉంటుందనే అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కారు చేసిన అప్పులతో వడ్డీ రేటు ఇప్పుడున్న దాని కంటే అదనంగా 6 శాతం ఎక్కువే ఉంటుంది. వీటన్నింటిని సమన్వయం చేసుకుంటే మెట్రో విస్తరణకు నిధులు ఎలా సర్దుబాటు చేస్తుందనేది ఇప్పుడొక చిక్కు ప్రశ్నగా మారింది. ఇందులో ఏమాత్రం తేడా జరిగిన నగరంలో మెట్రో విస్తరణ నిలిచిపోవడంతోపాటు, ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయ ప్రభావంతో నగరవాసులపై అధిక టికెట్ ధరల భారం పడనున్నది.
పెరుగనున్న మెట్రో ఆర్థిక భారాన్ని దించుకునే క్రమంలో టికెట్ ధరలు పెంచడంతోపాటు, మెట్రోకు ఉన్న విలువైన భూములను బలిపీఠం ఎక్కించే యోచనలో సర్కారు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి మొదటి దశ మెట్రో విస్తరణ సమయంలోనే అంచనాలకు అనుగుణంగా ప్రయాణికులు రద్దీ పెరుగలేదు. దీంతో మెట్రో టికెట్ల రూపంలో రావాల్సిన రెవెన్యూ 60 శాతం పెరిగినా.. ఇతర కాంపొనెంట్లు అయినా రియాల్టీ, ప్రకటనల ఆదాయం ఏటా తగ్గుతూనే ఉంది. దీంతో పెరుగుతున్న మెట్రో భారాన్ని తగ్గించుకునేందుకు అడ్డికి పావుశేరు చొప్పున భూములను విక్రయించడం లేదా? దీర్ఘకాలిక లీజు ప్రతిపాదికన రేవంత్ సన్నిహితులకు కట్టబెట్టే ప్రతిపాదనలు ఉన్నట్లుగా మెట్రో సీనియర్ అధికారుల నుంచి అందిన సమాచారం ద్వారా తెలిసింది. అదే గనుక జరిగితే నగరంలో మెట్రో నిర్వహణ భారం జనాలపై మోపి, విలువైన మెట్రో భూములను ధారాదత్తం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు స్కెచ్ వేసిందనే అనుమానాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.