సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ): ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న తెలంగాణ సర్కార్ ఆ భారాన్ని సామాన్య ప్రయాణికులపై వేస్తూ చుక్కలు చూపిస్తున్నది. ఇటీవల విద్యార్థుల బస్పాస్ చార్జీలు పెంచిన ఆర్టీసీ అధికారులు తాజాగా రోజువారి బస్పాస్లపై చార్జీలు పెంచడానికి సిద్ధమైంది. సీనియర్ సిటిజన్స్, మహిళల (మహాలక్ష్మి పథకం వర్తించనివారు) డే పాస్ చార్జీలు రూ.100 నుంచి రూ.120 వరకు, సాధారణ ప్రయాణికుల చార్జీలు రూ.120 నుంచి రూ.150 వరకు పెంచేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
పెంచిన ధరలు రేపు లేదా ఎల్లుండిలోగా అమలు కానున్నాయని సమాచారం. సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో వాటిని పరిష్కరించి రోజువారి బస్పాస్ చార్జీల పెంపును అమలు చేయనున్నారు. సాధారణంగా హైదరాబాద్ నగరానికి తెలుగు రాష్ర్టాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్లంతా రోజువారీ బస్పాస్ (డే పాస్) మీద తమ గమ్యస్థానాలకు ప్రయాణం చేస్తుంటారు. ప్రభుత్వ తీసుకునే తాజా నిర్ణయంతో ఇలాంటి ప్రయాణికులపై భారం పడనుంది. కాగా ఈ రోజువారి టికెట్టు 24 గంటలు పని చేస్తుంది.
ఉదాహరణకు ఈరోజు రాత్రి 9 గంటలకు డేపాస్ తీసుకుంటే మళ్లీ మరుసటి రోజు రాత్రి 9 గంటల వరకు ఈ టికెట్ గడువు ఉంటుంది. కాగా 12ఏళ్ల లోపల ఉన్న పిల్లలకు సైతం రోజువారి బస్పాస్ టికెట్ చార్జి 80 రూపాయలు ఉండగా ఇప్పుడు అది 100 రూపాయలు చేశారు. అయితే తాజాగా పెరుగనున్న బస్పాస్ చార్జీలతో ప్రయాణికులకు జేబులకు చిల్లుపడటం ఖాయంగా కనిపిస్తోంది. కాగా హైదరాబాద్లో గతంలో విద్యార్థుల బస్పాస్ చార్జీ రూ.400 ఉండగా దానిని రూ. 600కు పెంచిన విషయం తెలిసిందే.