సర్కారు ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్న కార్యాలయాలను తక్షణమే ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని స్పష్టమైన జీవో జారీ చేసింది. దాదాపుగా ప్రైవేట్ భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కాలుష్య నియంత్రణ మండలిలో మాత్రం అలాంటి చర్యలేమీ తీసుకోవడం లేదని సమాచారం. కేంద్ర కార్యాలయంలోకి పర్యావరణ అనుమతుల కేంద్రం, అప్పిలేట్ అథారిటీ, ఆర్సీ పురం జోనల్ కార్యాలయాన్ని తరలించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సిటీబ్యూరో: కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయం విశాలమైన అన్ని వసతులు కలిగిన భవనంలో ఉంది. కాలుష్య నియంత్రణ మండలి పరిధిలో పనిచేసే అన్ని విభాగాలకు సరిపడా గదులు, సదుపాయాలు పీసీబీ హెడ్ ఆఫీస్లో ఉన్నాయి. కానీ కాలుష్య నియంత్రణ మండలి పరిధిలో పనిచేసే పర్యావరణ అనుమతుల కార్యాలయం, కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ కార్యాలయం మాత్రం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండు కార్యాలయాలతో పాటు రామచంద్రాపురం జోనల్ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే కొనసాగుతున్నది. ప్రభుత్వ కార్యాలయాలేవీ అద్దె భవనాలు, ప్రైవేట్ బిల్డింగ్లు, ప్రైవేట్ స్థలాల్లో ఉండకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్యాలయాలను తక్షణమే ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సూచించింది.
ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలేవైనా ఖాళీగా ఉంటే అందులోకి తరలించాలని స్పష్టం చేసింది. కానీ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలు మాత్రం ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలికి చెందిన మూడు కార్యాలయాలకు నెలకు రూ.5 లక్షలకు పైగానే అద్దె చెల్లిస్తున్నారు. అమీర్ పేటలోని ఓ ప్రైవేట్ భవన సముదాయంలో పర్యావరణ అనుమతుల కార్యాలయం ఉంది. దీనికి నెలకు రూ.లక్షన్నరకు పైగానే చెల్లిస్తున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా కాలుష్య నియంత్రణ మండలికి వచ్చిన ఫిర్యాదులపై బాధితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటు చేసిన అప్పిలేట్ అథారిటీ కార్యాలయం కూడా నాంపల్లిలోని ప్రభుత్వ భవన సముదాయంలో కొనసాగుతున్నది. దీనికి కాలుష్య నియంత్రణ మండలి నుంచి రూ.1.5 లక్షల దాకా అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. రామచంద్రాపురం జోనల్ కార్యాలయం ఒక ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్నది.