సిటీ బ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలి పరిధిలోని హెచ్సీయూ భూముల్లో కాంగ్రెస్ సర్కారు చెట్లను నరికేసిన ప్రాంతంలో పుపరుద్ధరణ పనులు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు స్వాగతించారు. ప్రభుత్వం చేపట్టే పునరుద్ధరణ పనుల్లో యూనివర్సిటీ ప్లాంట్ సైన్స్ ప్రొఫెసర్లు, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని కోరారు.
ఎకాలజిస్టులు, ప్లాంట్ సైన్స్ ప్రొఫెసర్లను సంప్రదించి వారు సూచించిన మొక్కలనే నాటాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చదును చేసిన 100 ఎకరాల్లో అటవీ మొక్కలే ఉండేవని పునరుద్ధరణలో భాగంగా కూడా అలాంటి మొక్కలనే నాటాలన్నారు. మొక్కలను నాటే క్రమంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని చెప్పారు. కంచ గచ్చిబౌలి అడవిలో ఉండే జీవ జాతుల మనుగడకు అనువైన మొక్కలను ఎంపిక చేసి నాటాలని సూచించారు. ప్లాంట్ సైన్స్ డిపార్ట్మెంట్ గతంలో చేసిన సర్వే ప్రకారం ఆ భూముల్లో 80 శాతం అటవీ మొక్కలే ఉన్నాయని అన్నారు. తిరిగి అవే మొక్కలను నాటడం వల్ల పర్యావరణానికి ప్రమాదం లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ యూనివర్సిటీలో వనమహోత్సవం పేరుతో వియవాకి పద్ధతిలో మొక్కలను నాటిందని, అది పూర్తిగా అశాస్త్రీయమని ప్లాంట్ సైన్స్ విద్యార్థులు అంటున్నారు. కంచ గచ్చిబౌలి భూముల్లో గడ్డిని ఆహారంగా తీసుకునే జింకలు, కుందేళ్లు వంటి జంతువులు ఎక్కువగా ఉన్నాయని, మియావాకిలో మొక్కలను నాటడం వల్ల వాటికి ఆహారం దొరకదని చెప్పారు. దీంతో వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానుగ, వేప, జామూన్ వంటి చెట్లనే ఎక్కువ నాటుతున్నారని, వాటితో పాటు ఔషధ విలువలున్న మొక్కలు, అరుదైన జాతుల మొక్కలను నాటాలని కోరారు. మియావాకి పద్ధతిలో కాకుండా పర్యావరణ, ఎకాలజీ నిపుణుల సూచనలు పాటిస్తూ ఎంపిక చేసిన మొక్కలను నాటాలని కోరారు.
ప్లాంట్ సైన్స్ ప్రొఫెసర్లు, ఎకాలజిస్టుల భాగస్వామ్యం తప్పనిసరి కంచగచ్చిబౌలి భూముల్లో 80 శాతం అటవీ మొక్కలే ఉన్నాయి.కాబట్టి చెట్లను తొలగించిన ప్రాంతంలో వాటినే నాటాలి. పునరుద్ధరణ పనుల్లో యూనివర్సిటీ ప్లాంట్ సైన్స్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యం ఉండాలి. ప్లాంట్ సైన్స్ ప్రొఫెసర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలి. నిపుణులైన ఎకాలజిస్టులు సూచించిన మొక్కలనే నాటాలి. వారు ఆ ప్రాంతంలో నివసించే జీవజాతులకు అనువైన మొక్కలను సూచిస్తారు. దీంతో జంతుజాలం, వృక్షజాలం సమతూకంలో ఉంటుంది. పర్యావరణం వృద్ధి చెందుతుంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణ పనులు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది.
– ప్రవీణ్, రీసెర్చ్ స్కాలర్, ప్లాంట్ సైన్స్ డిపార్ట్మెంట్, హెచ్సీయూ