మేడ్చల్, నవంబర్17(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద భూ సర్వేను రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది. ప్రభుత్వ భూములలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సర్వే నిర్వహించి కేఎంఎల్ మ్యాప్(గూగుల్)లో పొందు పరిచేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలో గతంలో గుర్తించిన ప్రభుత్వ, అసెన్డ్ భూముల వివరాలను మరోసారి పరిశీలించి వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ యంత్రాంగం వ్యూహత్మకంగా వ్యవహరిస్తుంది.
ఈ క్రమంలో భూ పరిరక్షణకు జిల్లా రెవెన్యూ డివిజన్ స్థాయిలో సర్వేను కొనసాగిస్తున్నారు. అలాగే, భూ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు విధి విధానాలపై ప్రణాళికను రూపొందించింది. గుర్తించిన భూముల పరిరక్షణకు ప్రహరి, ఫెన్సింగ్ వంటి చర్యలపై దృష్టి సారించారు. అయితే, జిల్లాలో రెవెన్యూ రికార్డుల ప్రకారం, 5,195 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ప్రభుత్వ భూమి గత లెక్కల ప్రకారం.. ఉందా? లేక కబ్జాలకు గురైందా? అన్న విషయం సర్వే అనంతరం తేలనుంది.
జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు జరిగాయా? అన్న కోణంలో విచారణ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో మండలాల తహశీల్దార్లు గత రికార్డుల ప్రకారం ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లలో ఏమైనా ప్రైవేటు వ్యక్తులకు పట్టాలుగా మారాయా? అన్న దానిపై సర్వే నెంబర్ల ఆధారంగా పరిశీలిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ భూమి పట్టాగా మారిన క్రమంలో ఉన్నతాధికారులు ప్రభుత్వ భూములపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఒక వేళ ప్రభుత్వ భూమి పట్టాలుగా మారితే తక్షణ చర్యలు తీసుకుని తిరిగి ప్రభుత్వ భూములుగా మార్చుతామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలుగా మార్చిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న రక్షణ శాఖ భూములకు ఖాతా నంబర్లను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. కీసర, ఘట్కేసర్, శామీర్పేట్ తదితర మండలాలలో రక్షణ శాఖ భూములు వేలాది ఎకరాలలో ఉన్నాయి. దీంతో రెవెన్యూ అధికారులు రక్షణ శాఖ భూములు లెక్కల ఆధారంగా ఖాతా నంబర్లను కేటాయించనున్నారు. రక్షణ శాఖ భూములకు ఖాతా నంబర్లను కేటాయించడాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.