మేడ్చల్, ఫిబ్రవరి10(నమస్తే తెలంగాణ): అధికారులకు నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములలో సూచికల బో ర్డులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. దీంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్నగర్ కార్పొరేషన్లలో ప్రభుత్వ భూముల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దల సహకారంతోనే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నట్లు ప్రజల నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి.
పీ ర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో 103 సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. వివిధ డివిజన్లలో ప్రధాన రహదారుల వెంట అనుమతులు లేని షెడ్లు అనేకం వెలుస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోనే 975 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైనట్లు అధికారుల లెక్కల్లో తెలింది. ఇందులో 613, 614, 510, 432, 495 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్లుగా చేసి కబ్జాదారులు విక్రయిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం లోని 307, 325, 329, 342 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజల నుంచి అనేక ఆరోపణలు
వస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్న అధికారులు హెచ్చరికలకు మాత్రమే పరిమితమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తే తిరిగి మళ్లీ నిర్మించుకుంటున్నారు. ఇదంతా అధికారులు చూస్తున్న కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ భూమి అని తెలిపే విధంగా సూచిక బోర్డుల ఏర్పాటులో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 5,619 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులలో ఉంది. అయితే ఇటీవల ప్రభుత్వ భూముల లెక్కను తేల్చినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వ భూముల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. గుర్తించిన ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు గురికాకుండా ఉండేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేసి అవసరమైతే ఫెన్సింగ్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు అమలు చేయడం లేదు. దీంతో యథేచ్ఛగా భూములు కబ్జాలకు గురై అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.